బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ నిజంగా మనస్సున్న మంచి వ్యక్తి అని చెప్పవచ్చు. అప్పట్లో తాను బిగ్ బిస్ విన్నర్ అయినప్పుడు వచ్చిన ప్రైజ్ మనీ రూ.50 లక్షలను క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి పుల్వామా అమర జవాన్ల కుటుంబాల పట్ల తన ఔదార్యాన్ని ప్రదర్శించాడు. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశాడు.
బిగ్ బాస్ ఫేం కౌశల్ నిన్న తన సతీమణి నీలిమతో కలిసి హైదరాబాద్ ఐజీని కలసి సైనికుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లకు పోలీసులతో కలసి కౌశల్ నివాళులర్పించాడు. ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ (కేఏఎఫ్) విరాళాలు అందించాలని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు ద్వారా పిలుపునిచ్చాడు.
కౌశల్ ఆర్మీ ఫౌండేషన్‌కు వచ్చే విరాళాలను జవాన్ల కుటుంబాలకు అందజేస్తానని కౌశల్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపాడు. కాగా కౌశల్ కు మొదటి నుంచి సమాజ సేవ పట్ల మక్కువ ఎక్కువ. బిగ్ బాస్ సీజన్ 2 తరువాత కౌశల్ మరింత చురుగ్గా సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మొదలు పెట్టాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ద్వారా అతను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. కాగా ఇటీవలే తిత్లీ తుపాను సమయంలోనూ బాధితులకు కౌశల్ విరాళం అందించాడు. సహాయక చర్యల్లోనూ అతను పాల్గొన్నాడు.