టీవీల్లో, పత్రికల్లో, అక్కడా, ఇక్కడా మనకు ప్రముఖ నటులు, ఇతర సెలబ్రిటీలు ఫలానా ప్రొడక్ట్ వాడండి, బాగుంటుంది.. అని ప్రచారం చేస్తూ కనిపిస్తారు. నిజానికి వారు ఆ ప్రొడక్ట్స్‌ను వాడరు. కానీ బాగుంటుందని కితాబిస్తూ జనాలను వాడమని చెబుతూ యాడ్స్‌లో నటిస్తారు. అయితే జనాలు నిజంగానే అది నిజమే అని నమ్మి ప్రొడక్ట్స్‌ను కొని వాడి చూసి ఫలితం లేకపోవడంతో మోసపోతుంటారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో మోసపోతున్న అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కేసులు గెలుస్తున్నారు. సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక కేరళకు చెందిన ఓ వ్యక్తి కూడా సరిగ్గా అదే పని చేశాడు.
కేరళలోని త్రిసూర్ జిల్లా వైలాతూర్కు చెందిన ఫ్రాన్సిస్ వడక్కన్ అనే వ్యక్తి 2012లో అక్కడి ధాత్రి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన పత్రిక, టీవీ యాడ్లను చూసి ఆ కంపెనీ ఉత్పత్తి చేసిన హెయిర్ ఆయిల్‌ను కొన్నాడు. అప్పట్లో అతను ఆ ఆయిల్‌కు చెందిన ఒక బాటిల్‌ను రూ.376కు కొన్నాడు. కొద్ది రోజులు వాడాడు. అయితే అతని బట్టతలపై జుట్టు పెరగలేదు. దీంతో మళ్లీ ఒక బాటిల్‌ను అంతే మొత్తం చెల్లించి ఆ ఆయిల్‌ను 8 వారాల పాటు వాడాడు. అయినా వెంట్రుకలు పెరగలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అతను అక్కడి జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు.
కాగా ఆ కేసు విచారణ 8 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 29వ తేదీన ఫోరం వడక్కన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితుడికి 30 రోజుల్లోగా నష్టపరిహారం, కేసు ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ ఆయిల్‌కు ప్రచారం చేసిన అక్కడి మళయాళం నటుడు అనూప్ మీనన్‌కు కూడా ఫోరం రూ.10వేల జరిమానా విధించింది. అతను కేసు విచారణ సందర్భంగా ఆయిల్‌ను వాడలేదని, అయినప్పటికీ ప్రచారం చేశానని ఒప్పుకున్నాడు. దీంతో ఫోరం అతనికి జరిమానా విధించింది.
ఈ సందర్భంగా వడక్కన్ మాట్లాడుతూ.. తాను నష్టపరిహారం కోసం కేసు వేయలేదని, జనాలకు ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించడం కోసమే కేసు వేశానని తెలిపాడు. సాధారణంగా మనం టీవీల్లో, పత్రికల్లో చూసే అనేక యాడ్స్ ఇలాగే వినియోగదారులను తప్పుదోవ పట్టించేవిగా ఉంటున్నాయని, అందుకనే జనాలు అలాంటి యాడ్స్ చూసి మోసపోవద్దనే ఉద్దేశంతోనే, వారిలో అవగాహన తీసుకురావాలనే కారణంతో కేసు వేసి గెలిచానని తెలిపాడు.