జీవితంలో ఎన్ని ఎదురొచ్చినా అనుకున్నది సాధించడానికి కావాల్సిన పట్టుదల గురించి తెలిపే నిజ జీవిత కథ.

-

ఒక కుర్రాడు.. సినిమాలంటే ఆసక్తి ఉన్నవాడు. చిన్నప్పటి నుండి సినిమాలపై ఇష్టం పెంచుకుని ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుందామని, ఫిల్మ్ స్కూళ్ళో చేర్పించమని అడిగాడు. కానీ సినిమాలో కెరీర్ ఇష్టం లేని వాళ్ళ నాన్న మాత్రం సినిమాలు మంచివి కావు. అందులో నీ కెరీర్ కొనసాగదు అని చెప్పి కుర్రాడి ఇష్టాన్ని బేఖాతరు చేసాడు. కానీ సినిమాలపై ఇష్టం తగ్గని ఆ కుర్రాడు మాత్రం, నాన్నకి చెప్పకుండా ఫిల్మ్ స్కూల్ లో చేరిపోయాడు. ఈ దెబ్బతో తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగింది. కొన్నేళ్ళపాటు మాట్లాడుకోలేదు.

ఫిల్మ్ స్కూల్ లో చదువు పూర్తయ్యాక, హాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుందామని వచ్చాడు. కానీ రంగుల ప్రపంచం చుక్కలు చూపించింది. తన వద్ద ఉన్న స్క్రిప్టులు పట్టుకుని ఎన్ని నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగినా తిరస్కారమే మిగిలింది. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. వయసు 30కి చేరువవుతుంది. అప్పుడే తన క్లాస్ మేట్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఒకానొక ప్రయోగశాలలో ఆ అమ్మాయి పనిచేస్తుంది.

ఇలా ఇద్దరు కలిసి సొంత కాపురం పెట్టారు. కొన్ని రోజులకి వారికి కొడుకు పుట్టాడు. ఆ యువకుడికి తిరస్కారాలే మిగులుతున్నాయి. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. దాంతో తనమీద తనకు నిరాశ ఆవరించింది. అందుకని దర్శకుడు కావాలనే తన కలను పక్కన పెట్టి ఆర్థికంగా నిలబడడానికి కంప్యూటర్ టీచర్ గా చేరాడు. రోజూ వెళ్తున్నాడు. వస్తున్నాడు. తనలో మార్పును గమనించిన భార్య, ఇలా అంది. మీరెందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు.

దర్శకుడు కావాలనుకునే మీ కలని పక్కన పెట్టేస్తారా? తిరస్కారానికి గురైతే మాత్రం పూర్తిగా వదిలేస్తారా? ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే ఫలితం దొరుకుతుందేమో కదా అని ప్రోత్సాహక మాటలు మాట్లాడింది. ఆ మాటలు తనలో కొత్త శక్తిని నింపాయి. ఈ సారి మరింత పట్టుదలతో పనిచేసాడు. అలా పనిచేస్తుండగా, చైనీస్ మార్షల్ ఆర్ట్స్ మీద సినిమా తీసే అవకాశం దక్కించుకున్నాడు.

ఆ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. ఫారెన్ లాంగ్వేజ్ విభాగంలో అకాడమీ అవార్డు కూడా గెలుపొందింది. ఆ సినిమానే క్రంచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్. ఆ తర్వాత బ్రోక్ బాక్ మౌంటేన్ సినిమా తీసాడు. ఆ దర్శకుడెవరో కాదు. లైఫ్ ఆఫ్ పై సినిమాతో అకాడమీ అవార్డు అందుకున్న ఆంగ్ లీ. తైవాన్ కి చెందిన ఈ దర్శకుడు, తన పట్టుదలను ఏమాత్రం సడలించకుండా పనిచేసాడు.

మీ జీవితంలో ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దానికొరకే పనిచేయండి. విజయం ఇప్పుడే రాకపోవచ్చు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Exit mobile version