ఒక తండ్రి తన కొడుక్కి తాను వాడే ఓ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అది చాలా పాతది. ఆ వాచ్‌ను ఇస్తూ ఆ తండ్రి తన కొడుకుతో అన్నాడు.
ఈ వాచ్ మా తాతది. తరువాత నాన్న వాడారు. ఇప్పటి వరకు నేను వాడాను. ఇకపై ఇది నీది. దీన్ని వాడే ముందు ఒక్కసారి పక్కనే ఉన్న వాచ్ షాపుకు వెళ్లి దీని ధర తెలుసుకుని రా.. అన్నాడు.
దీంతో కొడుకు అలాగే చేశాడు. ఆ వాచ్‌ను వాచ్ షాప్‌లో చూపించి ఎంత ధర వస్తుంది ? అని అడిగితే షాపతను రూ.300 అన్నాడు. పాతది కదా, అంతకు మించి ఇవ్వలేనన్నాడు. దీంతో అదే విషయాన్ని కొడుకు వచ్చి తన తండ్రికి చెప్పాడు. దీంతో తండ్రి.. ఆ వాచ్‌ను మ్యూజియంలో చూపించి ఎంత ధర వస్తుందో తెలుసుకో.. అని పంపించాడు. ఆ కొడుకు మ్యూజియంకు వెళ్లి ధర అడగ్గా దానికి రూ.1 లక్ష ఇస్తామన్నారు.
వెంటనే కొడుకు తండ్రి వద్దకు వచ్చి విషయం చెప్పాడు. దీంతో తండ్రి.. ఈ వాచ్‌కు ఒక్కో దగ్గర ఒక్కో ధర వచ్చింది. అలాగే నువ్వు కూడా నీకు విలువ ఉండే దగ్గర జీవించు, విలువ లేని చోట ఉండవద్దు అని చెప్పాడు.