గుక్కెడు తల్లి పాలకు నోచుకోని అనాథ పసికందులకు ఆ 5 మంది తల్లులయ్యారు..!

-

నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న బాలమందిర్ అది. తల్లిదండ్రులకు పలు కారణాల వల్ల దూరమైన ఎంతో మంది పసికందులకు ఆ అనాథాశ్రమం ఆశ్రయం కల్పిస్తోంది.

కన్న తల్లిదండ్రులకు దూరమై.. ఎక్కడో దూరంగా అనాథాశ్రమంలో పెరుగుతున్న పసికందులు వారు.. ఇంకా పూర్తిగా కళ్లు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడలేని నిస్సహాయ చిన్నారులు వాళ్లు.. గుక్కెడు తల్లిపాలకు కూడా నోచుకోని అభాగ్యులు వారు.. అయినా వారికి ఆ ఐదుగురు మహిళలు తల్లి కాని తల్లులు అయ్యారు. ఆ అభాగ్యులను అక్కున చేర్చుకుని వారి కడుపు నింపుతున్నారు. తల్లి అంటే.. కేవలం కన్న బిడ్డలకే కాదు, ప్రతి చిన్నారికి ఆ ప్రేమను పంచవచ్చని ఆ తల్లులు చాటి చెబుతున్నారు.

నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న బాలమందిర్ అది. తల్లిదండ్రులకు పలు కారణాల వల్ల దూరమైన ఎంతో మంది పసికందులకు ఆ అనాథాశ్రమం ఆశ్రయం కల్పిస్తోంది. వారిని అక్కున చేర్చుకుని లాలిస్తోంది. అయితే ఆ పసికందులకు తల్లిపాలు లభించవు కదా. డబ్బా పాలే పట్టాలి. అందుకని ఓ బాలమందిర్ వారు ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. 5 నెలల కిందట తల్లిపాల పేరిట ఓ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అందులో భాగంగా బాలింతలుగా ఉన్న అనేక మంది తల్లులు తమ పాలను డబ్బాల్లో ఆ బాలమందిర్‌కు పంపి ఆ పసికందుకు తల్లిపాలతో కన్న ప్రేమను పంచుతున్నారు.

nepal balamandir toddlers breastfed by women

ఇక అనితా కుంపాహా, సానూ నగర్కోటి అనే ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం ఐదుగురు మహిళలు ఏకంగా ఆ బాలమందిర్‌కే వెళ్లి అక్కడే కొంత సేపు ఉండి నిత్యం అక్కడ ఉన్న 15 మంది అనాథ పసికందులకు పాలిస్తూ తల్లి ప్రేమను పంచుతున్నారు. అందుకుగాను వారు ఎంతో దూరం నుంచి బాలమందిర్‌కు వస్తుంటారు. నిత్యం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 11, 12 గంటల వరకు బాలమందిర్‌కు చేరుకుంటారు. అక్కడ పసికందుకు పాలిచ్చి వారిని లాలించాక తిరిగి మధ్యాహ్నం 3, 4 గంటలకు తమ తమ ఇండ్లకు ఆ మహిళలు వెళ్లిపోతారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆ బాలమందిర్‌లో ఉన్న ఆ పసికందులకు ఓ వైపు కన్న ప్రేమతోపాటు మరోవైపు తల్లిపాలు కూడా అందుతున్నాయి. కాగా ఆ బాలమందిర్ వారు మరింత మంది మహిళలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఆ అనాథ పసికందుల కోసం ఆ బాలమందిర్ చేస్తున్న ఈ పనిని నిజంగా మనమందరం అభనందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news