ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు తాము గతంలో ఇచ్చిన లంచాలను ఇప్పుడు ప్రజాప్రతినిధులు, నేతలు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.
అభివృద్ధి దిశగా సమాజం ముందుకు సాగాలంటే.. ముందుగా దేశంలో ఉన్న అవినీతిని పారదోలాలి.. అందుకు ప్రజల్లో చైతన్యం రావాలి.. అది విప్లవంగా మారాలి. అనేక పోరాటాలు చేయాలి. ప్రజలు చేసే పోరాటాలతోనే అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది.. వారు మారుతారు.. అప్పుడు ప్రజలు తాము కలలుగన్న సమసమాజ స్థాపన జరుగుతుంది. అవును.. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు ప్రజలు ఇదే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. తమ సమాజాన్ని బాగు చేసుకునేందుకు అవినీతిపరులైన రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు.
పశ్చిమబెంగాల్ ప్రజలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఓ అనూహ్య పరిణామానానికి తెరతీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు తాము గతంలో ఇచ్చిన లంచాలను ఇప్పుడు ప్రజాప్రతినిధులు, నేతలు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా రోజూ ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యే అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఒక నేత ఇంటిపై ప్రజలు దాడి చేసి తాము ఇచ్చిన లంచాలను తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేశారు.
అయితే ప్రజలు అలా తిరగబడేందుకు ఓ కారణం ఉంది. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఇటీవలే ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వడం కోసం ప్రజల నుంచి వసూలు చేసిన లంచాలను నేతలు తిరిగిచ్చేయాలని ఆమె అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకునే ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనమే అవుతోంది. ఏది ఏమైనా.. పశ్చిమబెంగాల్‌లో లాగానే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇలా ఉద్యమిస్తే అప్పుడు ఎవరూ లంచం తీసుకునేందుకు ధైర్యం చేయరు కదా.. నిజంగా ఇది శుభ పరిణామమనే చెప్పవచ్చు..!