హ్యట్సాఫ్.. గిరిపుత్రుల బడిపంతులు..

-

ఈ కొండ‌కోన‌ల్లో.. ఈ అడ‌వి గుండెల్లో.. ఒక గురువు గురించి మాట్లాడుకోవాలి మ‌నం. ఆదివాసీ బిడ్డ‌ల‌ను బ‌డి ఒడికి చేర్చిన యువకుడి గురించి చెప్పుకోవాలి మ‌నం.. మ‌న్యం మ‌న‌సు గెలుచుకున్న ఒక సాహ‌సికుడి సంక‌ల్పాన్ని ఈ ప్రపంచానికి వినిపించాలి మ‌నం.. అక్ష‌రం తెలియ‌ని ఆ గూడెం బిడ్డ‌ల‌ను సువ‌ర్ణాక్ష‌రాలుగా తీర్చిదిద్దుతూ స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖిస్తున్న‌ ఆ చ‌రిత్ర‌కారుడిని ఉపాధ్యాయ‌లోకానికి ప‌రిచ‌యం చేయాలి మ‌నం.. ఇలాంటి గురువు ఉండ‌బ‌ట్టే ఉపాధ్యాయ‌వృత్తి నిత్యం అత్యున్న‌త స్థానంలోనే కొన‌సాగుతోంది.. ఇలాంటి గురువు ఉండ‌బ‌ట్టే.. ఉపాధ్యాయ వృత్తిపై ఈలోకానికి అపార‌మైన గౌర‌వం ఉంటోంది. ఈ ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు దిశా నిర్థేశం చేస్తున్న యువ ఉపాద్యాయుడు గౌరవనీయులైన దాసుబాబు గురించి తెలుసుకుందాం..

అది ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దులోని మ‌న్యం ప్రాంతం. విశాఖ జిల్లా పెద్దబయలు మండలంలోని జమదంగి. ఈ గ్రామానికి చేరుకోవాలంటే సుమారు 20కిలో మీటర్ల‌ మేర కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్లాలి. దారి దరిదాపుల్లోనూ క‌నినిపించ‌దు. అన్నీ కాలిబాట‌లే. బస్సులు, వాహనాలాంటివేమీ ఆ గ్రామ‌ ప్రజలకు తెలియ‌దు. ఆ గ్రామంలో ఉన్న గిరిజ‌నుల‌కు తెలుగు భాష రాదు. కేవలం కొండ ఒడియా భాషలో మాత్రమే మాట్లాడుతారు.

అయితే.. జమదంగి గ్రామంలో గిరిజన విద్యార్థుల కోసం పాఠశాల ఉంది. కానీ.. ఇంత‌టి ప్రతికూల పరిస్థితుల మధ్య అక్కడ ప‌నిచేసేందుకు ఉపాధ్యాయులు అమ్మో.. అనేవారు. దీంతో అక్క‌డి పిల్ల‌ల‌కు చ‌దువు అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోయింది. 2016లో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించిన దాసుబాబుకు మొద‌ట ఇక్క‌డే డ్యూటీ ప‌డింది. కానీ.. ఆయ‌న బెద‌ర‌లేదు. నిండుమ‌న‌సుతో.. అక్క‌డి పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పాల‌న్న త‌ప‌న‌తో ఆయ‌న అక్క‌డికి చేరుకున్నారు. అక్క‌డే ఉంటూ వారి భాష నేర్చుకున్నారు.

ఆ త‌ర్వాత పిల్ల‌ల‌కు తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల‌ను నేర్చుతూ ముందుకు వెళ్తున్నారు దాసుబాబు. కొండ‌కోన‌లు ఉన్నాయ‌ని ఆయ‌న భ‌య‌ప‌డ‌లేదు. అమ్మో.. వాగువంక‌లు దాటాలా.. అని ఆయ‌న వెనుక‌డుగు వేయలేదు. ఆ గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపాల‌న్న సంక‌ల్పంతో ముందుకు వెళ్లి.. ఈరోజు ఉపాధ్యాయ వృత్తికే వ‌న్నె తెస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆ గూడెం వాసులే ఓ గుర్రాన్ని ఏర్పాటు చేశారు. దాసుబాబు దానిపై పాఠ‌శాల‌కు వ‌చ్చివెళ్తున్నారు.

స్వాతంత్య్ర‌ వేడుక‌ల‌కు ఆ గూడెం పిల్ల‌లంద‌రినీ తీసుకురావాల‌ని దాసుబాబుకు ప్ర‌త్యేక ఆహ్వానం అందింది. కానీ.. మార్గం స‌రిగా లేక కేవ‌లం ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు దాసుబాబు. ఇక అక్క‌డ ఆ విద్యార్థుల ప్ర‌తిభ‌ను చూసి.. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. దాసుబాబు కృషిని మెచ్చుకుంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. మ‌రి ఉపాధ్యాయులంద‌రూ దాసుబాబులాగే.. అంకిత‌భావంతో పనిచేస్తే.. పేద పిల్ల‌ల జీవితాల్లో వెలుగులు నిండుతాయి మ‌రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version