రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ చివరికి కమలం గూటికి చేరిన మాజీ ఎంపీ జీ వివేక్ టార్గెట్ ఆ ఇద్దరు నేతలట. 2019 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకుండా చేసిన ఆ ఇద్దరు నేతలను దెబ్బకు దెబ్బతీసే వ్యూహాంతో.. అంతకుమించిన వ్యూహంతో ఆయన ఉన్నారట. పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గ పరిధిలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారట. అయితే.. ఇంతకీ వివేక్ టార్గెట్‌గా మారిన ఆ ఇద్దరు నేతలు ఎవరనే కదా మీ డౌటు..! వారు మరెవరో కాదు.. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. వీరిద్దరే తనకు టికెట్ రాకుండ చేశారంటూ వివేక్ కసితో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి.. కాక కుటుంబానికి కోల్‌బెల్ట్ ఏరియాలో మంచి పట్టు ఉండేది. కాక వారుసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వినోద్, వివేకలు కూడా ఆ పట్టును కొనసాగించారు. కానీ.. సుమారు దశాబ్దకాలంగా వివేక్ రాజకీయంగా నిలదొక్కకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన వివేక్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి, 2014 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత వివేక్ మళ్లీ అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా కూడా ఆయన కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా పెద్దపల్లి ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ.. అనూహ్యంగా కేసీఆర్ మరొకరికి టికెట్ ఇచ్చారు. ఇక పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఇక్కడ విషయం ఏమిటంటే.. తనకు టికెట్ రాకుండా చేసింది ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దుర్గం చిన్నయ్యలేనని వివేక్ రగిలిపోతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల బీజేపీలో చేరారు.
ఎలాగైనా.. రాజకీయపూర్వ వైభవాన్ని పొందాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి.. వివేక్ రాకతో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో బీజేపీ మరింతబలపడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఆయన అనుచరులు, కాక కుటుంబ అభిమానులందరూ బీజేపీలోకి వస్తున్నారు.
ఇప్పటికే బెల్లంపల్లిలో మున్సిపల్ మాజీ చైర్మన్, అనుచరులను బీజేపీలోకి తీసుకొచ్చి, దుర్గం చిన్నయ్యకు భారీ షాక్ ఇచ్చారు వివేక్.
ముందుముందు ఇంకా చాలా షాకులు ఉంటాయని వివేక్ అనుచరులు అంటున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని గెలిపించి, తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని వివేక్ చూస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో టీఆర్ఎస్ కూడా వివేక్‌ను అడ్డుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో వివేక్ ప్రభావం కనిపించకుండా చేయాలని గులాబీ నేతలు చూస్తున్నారు.