కరోనా ఒకవైపు.. రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఒకవైపు. దీంతో క్యాబ్‌లు, ఆటోడ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారింది. కరోనా వల్ల ప్రయాణికుల రద్దీ బాగా తగ్గింది. ఇంకో వైపు భయపెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు. దీంతో వారు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. అయితే అలాంటి డ్రైవర్ల బాధను అర్థం చేసుకున్న ఓ పెట్రోల్ పంప్ యజమాని ఆటోడ్రైవర్లందరికీ ఒక్కొక్కరికీ 3 లీటర్ల చొప్పున పెట్రోల్ లేదా డీజిల్‌ను ఉచితంగా అందించాడు.
కేరళలోని కసరగొడ్ జిల్లా ఎన్మకాజె పంచాయతీ పరిధిలోని పెర్ల అనే ప్రాంతంలో ఉన్న కుడుకొలి పెట్రోల్ పంపులో ఇటీవల ఆటో డ్రైవర్లందరికీ ఉచితంగా పెట్రోల్, డీజిల్‌ను అందించారు. దీంతో ఈ విషయం వైరల్ అయింది. సదరు పంపు యజమాని అబ్దుల్లా మదుమూలె అబుధాబిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని సోదరు సిద్దిక్ పంపును నిర్వహిస్తున్నాడు. దీంతో ఒక రోజూ ఆటోడ్రైవర్లందరికీ ఉచితంగా 3 లీటర్ల చొప్పున పెట్రోల్ లేదా డీజిల్‌ను అందించాలని అబ్దుల్లా తెలిపాడు. సిద్దిక్ అలాగే చేశాడు.
ఈ వార్త తెలిసిన చాలా మంది చుట్టు పక్కల 15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మరీ ఉచితంగా పెట్రోల్, డీజిల్ పొందారు. ఉదయం 6.30 కు ఈ కార్యక్రమం ప్రారంభించగా రాత్రి 9.30 గంటలకు ముగిసింది. ఒక్క రోజే నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 313 మందికి ఉచితంగా ఇంధనాన్ని అందజేశారు. దీంతో ఈ పనిచేసిన సదరు యజమానులను అందరూ ప్రశంసిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, డ్రైవర్లు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశామని వారు తెలిపారు.