హుజూరాబాద్ బిజెపిలో ముసలం నెలకొంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరడంతో స్థానిక బిజెపి నేతలు అలకబునారు. ఇందులో భాగంగానే ఇవాళ జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిజెపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఆయన ఈ కీలక మీటింగ్ కు డుమ్మా కొట్టారు. బిజెపిలోకి ఈటల రాజేందర్ రాకను మొదటి నుంచి పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన అప్పటి నుంచి.. ఆయనను పెద్దిరెడ్డి ఇప్పటి దాకా కలవలేదు. పెద్దిరెడ్డి తాజా వ్యవహారంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నేతల్లో ఒక్కసారి అలజడి మొదలైంది. బీజేపీలోకి ఈటల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి.. గతంలోనే బీజేపీలోకి ఈటల వస్తే సునామీ వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
తాజాగా బీజేపీ ముఖ్య కార్యకర్తల మీటింగ్ కు డుమ్మా కొట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి. అంతేకాదు హుజురాబాద్ బరిలో తాను కూడా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. హుజరాబాద్ లో పోటీ కోసం ఇప్పటికే తన అనుచరులతో పెద్దిరెడ్డి కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆఫర్ వస్తే టీఆర్ఎస్ లోకి జంప్ కావడానికి కూడా పెద్దిరెడ్డి వర్గం సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా తాజా పెద్దిరెడ్డి ఎపిసోడ్ తో హుజరాబాద్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇంకా ఎన్నికలు జరిగే సరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.