10 వేల ఒంటెలను చంపనున్న ఆస్ట్రేలియా, ఎందుకంటే…!

-

కార్చిచ్చు ఆస్ట్రేలియాని దహించి వేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో అగ్ర భాగం మంటల్లోనే ఉంది. దీనితో ఆస్ట్రేలియాలో వేల ఎకరాల్లో పంటలు, లక్షల ఎకరాల్లో అడవులు, కోట్ల సంఖ్యలో అడవి జంతువులు, పెంపుడు జంతువులు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో మంటలు ఆస్ట్రేలియాను ఇబ్బంది పెడుతున్నాయి. మంటల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు.

ఆ మంటలను అదుపు చేయడానికి ఆ దేశం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా సరే అదుపులోకి మాత్రం రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ దేశంలో 10 వేలకు పైగా ఒంటెలను చంపెయ్యాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. దానికి పెద్ద కారణమే ఉంది. ఒక పక్క మంటల దెబ్బకు నీళ్ళు అవిరైపోయి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఉన్న కొద్దిపాటి నీళ్లను ఒంటెలు భారీగా  తాగేస్తున్నాయట. నీళ్లు లేక ప్రజలు ఎడారిజీవితం గడుపుతున్నట్లు తెలుస్తున్న నేపధ్యంలో ఆ దేశం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమంటే ఒంటెలను చంపేయడం.

దాదాపు 10 వేలకు పైగా ఒంటెలను హెలికాప్టర్ల నుండి అత్యాధునిక తుపాకులతో చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి. ఐదు రోజులపాటు వాటిని చంపేయనున్నారు అధికారులు. దావానల ఉష్ణం కారణంగా ఒంటెలు కంచెలను దాటుకొని ఇళ్లలోకి చొరబడి మరీ నీటిని తాగేందుకు ప్రయత్నిస్తున్నాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఏసీలలోనుండి వచ్చే నీళ్లచుక్కలను కూడా మిగలనివ్వడంలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన మిథేన్ వాయువును కూడా అవి విడుదల చేస్తున్నాయి. దీనితో వాటిని చంపాలని ఈ బాధాకర నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో దాదాపు 12లక్షల ఒంటెలున్నాయి.

మరోపక్క పెటా లాంటి జంతు కారుణ్యసంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ భూమి మీద ప్రతీ జీవికి జీవించే హక్కుంటుందని, దాన్ని నిర్మూలించే అధికారం ఏ దేశానికీ, ప్రభుత్వానికీ లేదని వారి వాదన. ఇంటర్‌నెట్‌లో, సోషల్‌మీడియాలో కూడా ఈ వార్త పట్ల నెటిజనులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే, ఇతర దేశాలనుండి నీళ్లు తెప్పించుకోవచ్చని, మూగజీవాలను చంపడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news