ఆకాశదేశాన విహరించే విహంగాలు కూడా ఎంతో ఆకర్షిస్తుంటాయి. ఒక్కో పక్షిది ఒక్కో ప్రత్యేకత. ఇప్పుడు చెప్పబోయే పక్షి అసలు రెక్కలాడించకుండానే వందల కిలోమీటర్లు పొలోమంటూ తిరిగేస్తానంటోంది. దాని పేరే ‘ఆండియన్ కాండోర్’. ఆండియన్ కాండార్ పక్షులు అతి బరువైన పక్షులు. ఇవి ఒక్కోటి 9.5 కిలోల నుంచి 14 కిలోల వరకు ఉంటాయి. పది అడుగుల వరకు విస్తరించి ఉండే ఈ పక్షులు.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణిస్తాయి. తాజాగా వీటిపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపింది.
అర్కైవల్ ‘డైలీ డైరీస్’, జీపీఎస్ యూనిట్లతో పాటు, మినియేచర్ వీహెచ్ఎఫ్ అనే పరికరాన్ని ఉపయోగించి ఎనిమిది కాండోర్ పక్షుల వింగ్ బీట్లను రికార్డ్ చేశారు. 250 గంటలపాటు వాటి ప్రయాణాన్ని గమనించారు. రెక్కలు ఆడించకుండా ఐదు గంటలకు పైగా గాల్లో ఎగిరిందని, దాదాపు 170 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రెక్కలను సమాంతరంగా ఉంచి ఆకాశంలో విహరించిందని శాస్ర్తవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ఇటీవలే ప్రచురితమైంది.