వర్షాకాలం. నీళ్ళు నిండిన దారుల్లో వాహనాలు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.

గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాగులు వంకలు, నదులు పొంగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ నీటి ప్రవాహాలే కనిపిస్తున్నాయి. పట్టణాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. ఏ వీధిలో ఏ మ్యాన్ హోల్ తెరుచుకుందో, ఏ దారిలో ఏముందో తెలియకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు బయటకు వెళ్ళాలనుకునే వారు, ముఖ్యంగా వాహనాలపై అది కూడా ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండడం బెటర్. కానీ, కొన్ని సార్లు బయటకి వెళ్తే తప్ప జరగని పనులు ఉంటాయి. అలాంటి అత్యవసర పనుల్లో తీసుకోవాల్సిజ జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తడిసిన రోడ్లమీద ప్రయాణం చాలా కష్టం. కాబట్టి టైర్లు, బ్రేకులు కండిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం అసలే వద్దు.

బైక్ హెడ్ లైట్, ఇండికేటర్ లైట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి. గేర్లు సరిగ్గా పడుతున్నాయా అన్నది ప్రాథమికంగా చూసుకోవాల్సిన అంశం.

బైక్ లో ఉండే కొన్ని వైర్లు బయటకి కనిపిస్తున్నాయేమో చూడండి. అలా కనిపిస్తే జాగ్రత్త వహించాల్సిందే. కొన్నిసార్లు వాటివల్ల షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

ద్విచక్రవాహన చైన్ కి ఆయికల్ సరిగ్గా ఉందా అనేది చూడాలి. వర్షాకాలంలో అది చాలా ముఖ్యం.

బైక్ మీద బయటకి వెళ్ళి వచ్చాక బైక్ ని శుభ్రం చేసి చైన్ కి ఆయిల్ వేయండి.

అలాగే తెలియని ప్రాంతాల వైపు వెళ్లకుండా ఉండండి. తెలిసిన ప్రాంతాల్లోనే ఒక్కోసారి ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుందో అర్థం కాదు. అలాంటిది తెలియని ప్రదేశాల్లో పర్యటించడం సరికాదు.

రోడ్డు మీద నీళ్ళు నిలిచి ఉన్నప్పుడు వాటి లోతెంతో తెలుసుకోండి. లేదంటే సైలెన్సర్ లోకి నీళ్ళు పోయి ఇంజన్ మీద ప్రభావం పడి బైక్ అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఏదైనా ఇబ్బంది ఎదురయ్యి బాగా ప్రవాహం ఉన్న నీళ్ళలో బైక్ ఆగిపోతే భయపడాల్సిన పనిలేదు. ముందుగా హెల్ప్ లైన్ నంబరుకి కాల్ చేయడం మంచిది.