అమెరికాలో మిస్ట‌రీగా మారిన ఏరియా 51 ప్రాంతం.. ఇంత‌కీ అదేమిటి..? ఎక్క‌డుంది..?

-

ఏరియా 51.. ఈ మ‌ధ్య కాలంలో మ‌న‌కు బాగా వినిపిస్తున్న పేరు. సోష‌ల్ మీడియాలో దీనిపై పెద్ద ఉద్య‌మ‌మే న‌డుస్తోంది. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో లాస్ వెగాస్‌కు సుమారుగా 120 కిలోమీట‌ర్ల దూరంలో ఏరియా 51 ఉంటుంది.

ఏరియా 51.. ఈ మ‌ధ్య కాలంలో మ‌న‌కు బాగా వినిపిస్తున్న పేరు. సోష‌ల్ మీడియాలో దీనిపై పెద్ద ఉద్య‌మ‌మే న‌డుస్తోంది. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో లాస్ వెగాస్‌కు సుమారుగా 120 కిలోమీట‌ర్ల దూరంలో ఏరియా 51 ఉంటుంది. అక్క‌డ ఎంతో కాలంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అనుమ‌తి లేదు. కేవ‌లం అమెరికా ర‌క్ష‌ణ శాఖ మాత్ర‌మే ఏరియా 51లో ఉంటుంది. ఆ శాఖ‌కు చెందిన అధికారులు, సిబ్బందికి మాత్ర‌మే ఏరియా 51లోకి అనుమతి ఉంటుంది. అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దీనిపై పెద్ద ఉద్య‌మాన్ని న‌డుపుతున్నారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా ఇందులోకి అనుమ‌తినివ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏరియా 51 అంటే ఏమిటి..? దానికి ఎందుకంత ప్రాధాన్య‌త ఏర్ప‌డింది..? అంటే…

అమెరికా ర‌క్ష‌ణ ద‌ళం ఏరియా 51లో సైనికుల‌కు శిక్ష‌ణ‌నిస్తుంద‌ని చెబుతోంది. అది నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్‌గా పిల‌వ‌బ‌డుతోంది. కేవ‌లం మిల‌ట‌రీ వారికి మాత్రమే ఏరియా 51లోకి అనుమ‌తి ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఇత‌రులెవ‌ర్నీ అనుమ‌తించ‌రు. ఇక ఆ ప్రాంత గ‌గ‌న త‌లంలో కూడా హెలికాప్ట‌ర్లు, డ్రోన్లు, విమానాల ప్ర‌యాణంపై నిషేధం ఉంది. ఎవ‌రైనా నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి ఆ ప్రాంతంలో ప్ర‌వేశించినా.. లేదా గాల్లో ఏదైనా వాహ‌నంలో అక్క‌డి గ‌గ‌న త‌లంలో ఎగిరినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు.

అయితే ఏరియా 51లో నిజానికి సైనికుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌ర‌ని, అక్క‌డ గ్ర‌హాంత‌ర‌వాసుల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నార‌ని, అందుకే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అక్క‌డికి అనుమ‌తినివ్వ‌డం లేద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏరియా 51లో 1950ల‌లో కొన్ని యూఎఫ్‌వోలు అక్క‌డ గాల్లో ఎగురుతూ కూలిపోయాయ‌ట‌. వాటిని అప్ప‌ట్లో కొంద‌రు చూశార‌ట‌. దీంతో ఆ యూఎఫ్‌వోల మీద ఏరియా 51లో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నార‌నే వార్త‌లు అప్పటి నుంచి చెలామ‌ణీలో ఉన్నాయి. అందుక‌నే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అక్క‌డ అనుమ‌తి లేద‌ని చెబుతుంటారు.

కాగా ఏరియా 51లో అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని క‌చ్చితంగా బ‌య‌టి ప్రపంచానికి చెప్పాల‌ని, అమెరికా ర‌క్ష‌ణ ద‌ళం ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని ర‌హ‌స్యాల‌ను దాస్తుంద‌ని ఆరోపిస్తూ.. ఇటీవ‌ల పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ఏరియా 51 ఉద్య‌మం ప్రారంభ‌మైంది. ఏరియా 51కు వెళ్లి అక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలుసుకుందాం.. పదండి.. అంటూ ఫేస్‌బుక్‌లో ఒక పేజీ కూడా క్రియేట్ అయ్యింది. దానికి 15 ల‌క్ష‌ల మంది లైక్ కొట్ట‌డం విశేషం. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న అమెరికా ర‌క్ష‌ణ శాఖ ఏరియా 51లోకి ఎవ‌రికీ అనుమ‌తి లేద‌ని మ‌రోమారు తెగేసి చెప్పింది. ఎవ‌రైనా అడుగు పెట్టాల‌ని చూస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. దీంతో అక్క‌డికి వెళ్లేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు.

ఇక ఏరియా 51 ఆధారంగా గతంలో ప‌లు హాలీవుడ్ మూవీల‌ను కూడా తీశారు. కేవ‌లం అమెరికా ర‌క్ష‌ణ ద‌ళం, అమెరికా అధ్య‌క్షుడికి మాత్ర‌మే ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అనుమ‌తి ఉంటుంద‌ని ఆ మూవీల్లో చూపించారు. ఇక ఇండిపెండెన్స్ డే అనే ఓ సినిమాలో అయితే ఏరియా 51లో ఏలియ‌న్స్ మీద ప్ర‌యోగాలు చేస్తున్న‌ట్లు కూడా చూపించారు. దీంతో నిజంగానే ఆ ప్రాంతంలో గ్ర‌హాంత‌ర వాసుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారేమోన‌ని సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. మ‌రి ఏరియా 51 ఉద్య‌మం చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news