భారతదేశంలోని మహానగరాల్లోనే కాదు.. ఇతర మామూలు నగరాలు, పట్టణాల్లోనూ రహదారులు మనకు నాసిరకంగా కనిపిస్తుంటాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కొట్టుకుపోయి గుంతలుగా మారి కంకర తేలి దర్శనమిస్తుంటాయి. వాటిల్లో వాహనదారులు ప్రయాణిస్తూ నరకం అనుభవిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గుంతల వల్ల ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే బెంగళూరు మున్సిపాలిటీ అలాంటి బాధితులకు ఇకపై నష్ట పరిహారం అందివ్వనుంది.
బ్రుహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అక్కడి హైకోర్టు సూచనల మేరకు ఇకపై అక్కడ గుంతలు పడ్డ రహదారులపై ప్రయాణిస్తూ ఎవరైనా వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల బారిన పడినా, చనిపోయినా.. బీబీఎంపీ వారికి నష్ట పరిహారం అందిస్తుంది. గాయం చిన్నది అయితే రూ.5వేలు, 3 రోజుల చికిత్స తీసుకునేంత గాయం అయితే రూ.10వేలు, అంతకన్నా కొద్దిగా ఎక్కువ గాయాలు అయితే రూ.10వేల నష్టపరిహారం ఇస్తారు. ఇక గుంతల వల్ల ప్రమాదానికి గురై చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారం ఇస్తారు.
ఇక బాధితులకు రూ.10వేల వరకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేస్తారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానం అక్కడ అమలులోకి వచ్చింది. అయితే బాధితులు తమకు యాక్సిడెంట్ అయినట్లు ప్రూఫ్ చూపించాలి. ఏదైనా ఫొటో, వీడియో లేదా పత్రాలను చూపించాలి. అది కూడా యాక్సిడెంట్ అయ్యాక 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకుని నష్ట పరిహారం పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ విధానం ఎంతో మందికి మేలు చేస్తుందని భావిస్తున్నారు.