భార్య కడుపుతో ఉంటే..భర్తకు లీవ్ ఇప్పుడు కొత్త చర్చను లేవనెత్తాడు విరాట్ కోహ్లీ. మెటర్నిటీ లీవ్ అంటే అందరికీ తెలిసిందే.. తాజాగా పెటర్నల్ లీవ్ తెరపైకి వచ్చింది. మానసికంగా, శారీరకంగా భార్యకు భర్తే కొండంత ధైర్యం అని కొందరంటుంటే… భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే భర్తకు సెలవులెందుకు? దండగ అంటున్న వాళ్లూ ఉన్నారు. అసలు పెటర్నల్ లీవ్ అవసరమా..
ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ… టెస్ట్ సిరీస్‌కు దూరమవుతున్నాడు. భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌గా ఉండటంతో… పెటర్నల్ లీవ్ పెట్టి ఇండియా వెళ్తున్నాడు. కోహ్లీ పెట్టిన లీవ్‌కి బీసీసీఐ కూడా ఆమోదం తెలిపింది. అయితే… కోహ్లీ లీవ్ పై మండిపడుతున్నారు టీం ఇండియా ఫ్యాన్స్. దేశం కంటే భార్యే ముఖ్యమా అని కొందరు.. ధోనీని చూసి కోహ్లీ నేర్చుకోవాలని కొందరు… అనుష్క కడుపుతో ఉంటే కోహ్లీ ఏం చేస్తాడని మరికొందరు.. సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
ఈ కామెంట్లపై కోహ్లీ కూడా ఘాటుగానే స్పందించాడు. తన భార్య అనుష్కశర్మ మొదటి బిడ్డకు జన్మనిస్తోందని… అది తనకెంతో ముఖ్యమని.. ఆ క్షణాల్లో అనుష్క దగ్గర తాను లేకపోతే ఎలా అని కోహ్లీ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా టూర్ కి ఎంపికవడానికి ముందే లీవ్ పెట్టానని చెప్పాడు. .విరాట్ పెట్టిన పెటర్నల్ లీవ్ .. ఇప్పుడు… ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. పెటర్నల్ లీవ్ కూడా ఉంటే బాగుటుందనీ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు ఈ విషయమై ఆలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు మెటర్నిటీ లీవ్ మాత్రమే అందరికీ తెలుసు. విదేశాలకే పరిమితమైన పెటర్నల్ లీవ్… ఇండియాలో వర్కవుట్ అవుతుందా..? అసలు పెటర్నల్ లీవ్ ఎంత ఇంపార్టెంట్ న్న చర్చకు దారి తీసింది.
నిజానికి పాశ్చాత్య దేశాల్లో ఇదేం కొత్త విషయం కాదు. అక్కడ ఇలాంటి చట్టాలు కూడా ఉన్నాయి. సంప్రదాయాలకు నెలవుగా చెప్పుకొనే మనదేశంలో పరిస్థితులను, అక్కడి పరిస్థితులను పోల్చడం సాధ్యమేనా? ఇల్లాలు నెల తప్పిందనగానే.. ఆ ఇంట్లో అందరి కంటే ఎక్కువగా సంతోషించేవాడు ఆమె భర్తే. ఎందుకంటే, తండ్రిగా తాను మరో గొప్ప బాధ్యతను నిర్వర్తించబోతున్నాననే అనుభూతి, తన ప్రతిరూపమొకటి ఈ ప్రపంచంలోకి రాబోతోందన్న ఆనందం.. అతనిలో అమితమైన ఆసక్తిని పెంచుతుంది. అయితే, భార్య కడుపుతో ఉండగా.. ఆమెకు తోడుగా ఇంటిపట్టునే ఉంటూ సాయమందించే వెసులుబాటు మాత్రం మనదేశంలో చాలా తక్కువనే చెప్పాలి.
అయితే, అమెరికాలాంటి దేశాల్లో భార్య ప్రసవించే సమయంలో భర్త పక్కనే ఉండాలన్న కఠినమైన చట్టం అమల్లో ఉంది. చాలా దేశాల్లోనూ ఇలాంటి చట్టాలే ఉన్నాయి. మన దేశంలో మాత్రం.. ఆ స్థాయిలో చట్టాలు అమల్లోకి రాలేదు. అయితే, తాజాగా టీమిండియా క్రికెట్ విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క ప్రసవ సమయంలో తోడుగా ఉండాలని పెటర్నల్ లీవ్ తీసుకోవడంతో.. ఈ అంశం తీవ్రమైన చర్చకు దారి తీసింది.