ధనమే అన్నింటికి మూలం అనేది జగమెరిగిన సత్యం.. ఇప్పుడు భారతదేశంలో జరగుతున్న నేరాలు..ఘోరాలకు మందే అన్నింటికి మూలమని తేల్చేస్తున్నారు సామాజిక విశ్లేషకులు. ఇటీవల దేశ వ్యాప్తంగా వరుసగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు.. హత్యల వెనుక అసలు కోణం ఇదేనని తెలుస్తోంది. మందుకు బానిసలుగా మారిన వారు..తమ విచక్షణను కోల్పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. టీనేజీ వయస్సు నుంచే యువత తాగుడును అలవాటు చేసుకుంటోంది.
నగరాల్లో పబ్, పార్టీ కల్చర్ తీవ్రంగా పెరిగిపోయింది. ఈ ఖర్చులను వెళ్లదీసుకోవడానికి బిటెక్ చదువుతున్న విద్యార్థులు ఏకంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అప్పట్లో హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. చైన్ స్నాచింగ్‌లలో వీరే అధికంగా ఉంటున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మద్యం అమ్మకాలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం…గ్రామాల్లో కూడా బెల్ట్‌షాపులు పెరిగిపోవడంతో కిరాణా షాపుల్లో వస్తువుల్లాగా మద్యం ఊర్లల్లో లభిస్తోంది.
ఫలితంగా యువత పెడదారి పడుతోందిని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వయస్సుతో నిమిత్తం లేకుండా బాలికలపై, మహిళలపై, చివరికి వృద్ధులను కూడా కాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాశ్చత్య సంస్కృతి మోజులో పడిపోతున్న యువత పెడధోరణిలో వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, మంచి నడవడికకు నిలయమైన భారతదేశంలో ఇలాంటి ఘోరాలు దేశ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు.
సహజంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఇష్టపడి ఈ దేశానికి రావడానికి విదేశీయులు ఇష్టపడుతున్నారని, కానీ దేశంలో ప్రస్తుతం నెలకొంటున్న దారుణాలతో ఈ గడ్డపై ఎందుకు పుట్టామని మహిళలు భయంభయంతో బతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు మద్యంను కట్టడి చేయడంతో పాటు మహిళలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలు తీసుకురాకుంటే మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.