కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చేతులను శుభ్రం చేసుకోవడం అనేది మన నిత్య కృత్యంగా మారింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను హ్యాండ్ వాష్, సబ్బుతోపాటు శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అయితే శానిటైజర్లలో ఆల్కహాల్ ఉంటుంది. కనుక అది కేవలం కొంత సేపు మాత్రమే వైరస్‌ల నుంచి రక్షణ అందిస్తుంది. కానీ ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ 24 గంటల ప్రొటెక్షన్ ఇచ్చే నూతన తరహా శానిటైజర్‌ను రూపొందించారు. ఇందులో ఆల్కహాల్ అస్సలే ఉండదు.
ఢిల్లీ ఐఐటీకి చెందిన నానోసేఫ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ వారు కాపర్ (రాగి) అణువులతో కూడిన జీరో ఆల్కహాల్ శానిటైజర్‌ను కొత్తగా రూపొందించారు. ఇందులో ఆల్కహాల్ అస్సలే ఉండదు. అయితే దీంతో చేతులు, ఇతర భాగాలు శుభ్రమవుతాయా.. అంటే.. అవును.. కచ్చితంగా శుభ్రంగా మారుతాయి. ఈ శానిటైజర్‌ను వాడితే కోవిడ్ సహా దాదాపుగా అన్ని రకాల వైరస్‌లు, బాక్టీరియాలు కొన్ని సెకన్లలోనే నశిస్తాయి. పైగా ఆల్కహాల్ శానిటైజర్లు అయితే రాసుకున్నప్పుడే రక్షణ ఉంటుంది. కానీ నానో సేఫ్ సొల్యూషన్స్ వారు తయారు చేసిన శానిటైజర్ అయితే ఒక్కసారి రాసుకుంటే 24 గంటల పాటు రక్షణ ఇస్తుంది.
ఇక నానోసేఫ్ సొల్యూషన్స్ వారు తయారు చేసిన సదరు శానిటైజర్‌కు రబ్‌సేఫ్ అని పేరు పెట్టారు. దీన్ని ఆ స్టార్టప్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. ఇది రెండు రకాల ఫ్లేవర్లు.. లావెండర్, లెమన్ గ్రాస్‌లలో లభిస్తోంది. కాగా ఇదే స్టార్టప్ గతంలో ఎన్‌సేఫ్ పేరిట వినూత్న తరహా మాస్కులను తయారు చేసింది. వాటిని ఏకంగా 50 సార్లు ఉతికి వాడుకోవచ్చు. అలాగే ఎన్95 మాస్కులంత రక్షణను అవి ఇస్తాయి. ఈ క్రమంలోనే వారు తాజాగా ఆల్కహాల్ లేని శానిటైజర్‌ను తయారు చేయడం విశేషం.