మీ పిల్లలకు టేబుల్ మ్యానర్ నేర్పించారా..?అయితే ఇలా చేసేయండి..!

-

న్నతనంలో పిల్లలకు ఏం నేర్పిస్తామో…పెద్దవతూ అవే నేర్చుకుంటారు..అలానే ఫాలో అవుతారు. మనం ఇంట్లో పిల్లలను ఎంత క్రమశిక్షణగా పెంచుతామో దాని ఫలితం..బయట అకేషన్స్ లో వాళ్లు ప్రవర్తించిన రోజు కనపడుతుంది. వాళ్ల ముద్దు ముద్దు చేతులతో నీట్ గా చేస్తే.. చూసేవారికి, వాళ్ల పేరెంట్స్ కి ఎంతో హాయిగా ఉంటుంది. ముఖ్యంగా తినటం.. మనం పిల్లల మీద ఉన్న అతి గారాబంతో వాళ్లకు గోరుముద్దలు చేస్తూ పెడుతుంటాం. ఒక ఏజ్ వచ్చాక వాళ్లంతట వాళ్లు తినటం అలవాటు చేసుకోవాలి. కానీ పేరెంట్స్ అలా చేయరు. రెస్టారెంట్స్ కి వెళ్లినప్పుడో లేదా రిలేటీవ్ స్ ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లినప్పుడో ఇక మనం వాళ్లను పక్కన పెట్టుకుని..అక్కడ కూడా తినిపిస్తూ.. వాళ్లు అది సరిగ్గా తినకా ఆగం ఆగం చేస్తారు. పిల్లలకు 7 ఏళ్ల నుంచి అన్ని నేర్పించవచ్చు.

ఏడేళ్ల పాప రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఫోర్క్ ఎలా ఉపయోగించాలో తెలియక ఆహారమంతా డ్రస్‌పై, టేబుల్‌పై పడేసుకొని చిందర వందర చేస్తే… ఏం బాగుంటుంది చెప్పండి. చిన్నపిల్లలు తినేప్పుడు సరిగ్గా తినక ఆహారం మీద వేసుకుంటారు.. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు.. ‘వీడికి తిన్నగా తినడం ఎప్పుడొస్తుందో.. ఏమో..!’ అనుకోవడం సహజం. అయితే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ వహిస్తే చాలు. నలుగురితో కలిసి భోజనం చేసేటప్పుడు ఎలా నడుచుకోవాలి? ఆహారం తీసుకునేందుకు ఉపయోగించే వస్తువుల్ని ఎలా వాడాలి..? డైనింగ్ టేబుల్ దగ్గర పాటించాల్సిన కొన్ని పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేర్పించాలి. అవేంటంటే..

కూర్చోవడం ఇలా..

డైనింగ్ టేబుల్‌పై అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలో ఏవైనా తలగడలు లేదా కుషన్స్ వంటివి ఏర్పాటు చేయండి. లేదా ప్రత్యేకించి పిల్లల కోసం సౌకర్యవంతంగా తయారు చేయించిన కుర్చీ ఏర్పాటు చేస్తే మరీ మంచిదీ. అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే ముందు కుర్చీని శబ్దం వచ్చేలా జరపకూడదని వారికి తెలియజేయాలి. ఒకవేళ వారు కుర్చీని టేబుల్‌కి దగ్గరగా జరుపుకోవడానికి వీల్లేకపోతే.. మీరే నెమ్మదిగా జరిపే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు టేబుల్ ఎక్కి కూర్చుంటుంటారు. అలాంటప్పుడు అది సరికాదని వారికి తెలియజేస్తూ.. అనువుగా ఎలా కూర్చోవాలో పిల్లలకు నేర్పించాలి. అయినా కొందరు చిన్నారులు మారాం చేస్తుంటారు. కాబట్టి వారిపై కోపం తెచ్చుకోకుండా ఓపికతో వ్యవహరిస్తూ నెమ్మదిగా ఈ పద్ధతిని నేర్పించండి.

ఆహారం తీసుకునే విధానం..

టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ప్లేటులో ఎంత ఆహారం పెట్టుకోవాలి? ఏ విధంగా తినాలి..? మొదలైన విషయాలు కూడా సున్నితంగా వారికి ఒకటికి రెండుసార్లు వివరించాలి. ప్లేటును ఆహారంతో నింపేయడం కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో ఆహారం పెట్టుకొని బాగా నమిలి తినే విధానం వారికి చెప్పాలి. ఇలా తినడం వల్ల వారికి ఆహారం రుచించి ఇంకాస్త ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతిని వారికి నేర్పించడం వల్ల మీరు బయటికి వెళ్లినప్పుడు కూడా వారంతట వారే ఆహారం తింటారు.

వేటిని దేనికి ఉపయోగించాలి?

డైనింగ్ టేబుల్‌పై స్పూన్‌లు, చాకులు, ఫోర్క్‌లు.. ఇవన్నీ ఓ హోల్డర్‌లో వేసి ఉంటాయి. ఆహారం తీసుకునే క్రమంలో వేటిని దేనికి ఉపయోగించాలి? వాటిని ఏ విధంగా పట్టుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందో కూడా వారికి నేర్పించాలి. ఉదాహరణకు.. కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న స్పూన్‌ను సలాడ్స్ తినడానికి, చిన్న పరిమాణంలో ఉన్న స్పూన్‌ను ఐస్‌క్రీమ్స్, స్వీట్స్.. వంటివి తినడానికి ఉపయోగించాలని చిన్నారులకు చెప్పాలి. అలాగే చాలామంది పిల్లలు వారికి ప్లేట్లో తినడం సరిగ్గా రాక.. చుట్టూ ఆహారం పడేస్తుంటారు. కాబట్టి వారికి ముందుగా గిన్నెలో తినడం నేర్పించి.. ఆ తర్వాత ప్లేట్లో తినే విధానాన్ని అలవాటు చేయండి.

మర్యాదపూర్వకంగా..

ప్లేట్ లో వడ్డించిన పదార్థం కాకుండా టేబుల్‌పై ఉన్న ఇతరత్రా పదార్థాలు కావాలనుకున్నప్పుడు వాటిని వేయమని గట్టిగా అరవడం కాకుండా.. మర్యాదపూర్వకంగా అడగమని పిల్లలకు సూచించాలి. ఈ క్రమంలో ప్లీజ్, థాంక్యూ.. వంటి పదాలు వారికి అలవాటు చేయాలి. ఫలితంగా బయట రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు పిల్లలు కూడా హుందాగా, వినయంగా నడుచుకుంటారు.

భోజనం చేయడం ముగిసిన తర్వాత..

భోజనం చేయడం పూర్తయిన తర్వాత ప్లేట్‌లో చేతులు కడగకుండా జాగ్రత్తగా కిందకు దిగి సింక్ లేదా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి శుభ్రం చేసుకోవాలని వారికి విధిగా నేర్పించాలి. అలాగే పిల్లలకు తిన్న తర్వాత ప్లేట్ తీయడం లేదా వాటిని వాష్ చేయడం.. వంటి అలవాట్లు వారు ఎదుగుతున్న కొద్దీ నేర్పించాలి. ఫలితంగా ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునే స్వభావం వారికి అలవడుతుంది.

ఇలా చిన్నతనం నుంచే వారికి టేబుల్ మ్యానర్ అలవాటు చేస్తే..బయటకు వెళ్లినప్పుడు వినయంగా..డీసెంట్ గా తింటారు. చాలామంది చిన్నపిల్లలను బయటకు తీసుకెళ్లినప్పుడు వారు ఆహారం అంతా..చిందవందరగా చేస్తుంటారు. దాని ప్రభావం వారి తల్లిదండ్రుల మీదే పడుతుంది. ఏం నేర్పించారో ఏంటో అని అనుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు ఎంతబాగా బిహేవ్ చేశారు అనే దాన్నిబట్టే తల్లిదండ్రులు ఎంత బాగా పెంచుతున్నారు అని లెక్కేస్తుంది ఈ సమాజం. వాళ్లకోసం కాకపోయినా..మంచి అలవాటు నేర్పిస్తే తప్పేముందంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news