అమ్మాయి లేదా అబ్బాయికి పాతికేళ్ళు వస్తే చాలు తల్లి దండ్రులు పెళ్ళి వేటలో పడతారు..వారి గుణ గణాలకు తగిన వారి కోసం బంధువుల తో పాటు కనిపించిన వారికి చెబుతారు..అయితే పరిస్థితులు మారిపోయాయి. గతానికి, భవిష్యత్ కు స్పష్టమైన తేడా వచ్చేసింది. పెళ్లి విషయంలో యువతకు చాలా నమ్మకాలున్నాయి. ఉద్యోగవ్యాపారాల్లో ఆర్థికంగా స్థిర పడిన తర్వాత పెళ్లి అని కరాకండీగా చెప్పేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువతుల్లోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉంది. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో యువరైతులకు అమ్మాయిలు దొరకని దుర్భర స్థితులు నెలకొన్నాయి.
అన్నం పెట్టేవాడు రైతు అని, రైతే దేశానికి వెన్నెముక గా చెప్పుకుంటున్న రైతులకు పెళ్లి కుదరడం సమస్యగా మారిపోయింది. అబ్బాయి వ్యవసాయం చేస్తాడు అని చెప్పగానే అతనికి వధువును ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇప్పుడు అందరు ఫ్యాషన్ వైపు పరుగులు తీస్తున్నారు..ముఖ్యంగా సాఫ్ట్ వేరు లకు పిల్లను ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని దీన్ని ఉదాహరణగా చెప్పొచ్చు.ఇలాంటి వారి ఇబ్బందులను తీర్చేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి కర్ణాటక వాసులు తీసుకొచ్చారు.
మండ్యలో నిర్వహించిన భారీ పెళ్లిచూపుల కార్యక్రమం.. యువ రైతులు పెళ్లి కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.మండ్య జిల్లాలోని ఆదిచుంచనగిరిలో ఒక్కలిగ కులస్థులు.. వధూవరుల సమ్మేళనాన్ని నిర్వహించారు. మండ్య జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు ఈ సమ్మేళనానికి తరలివచ్చారు. 250 మంది అమ్మాయిలు రాగా.. వారిని చూసుకోవడానికి 11,775 మంది యువకులు వచ్చారు. వీరందరూ యువ రైతులే కావడం గమనార్హం. పెళ్లిచూపులకు వచ్చిన యువకుల క్యూలైన్ చూసి అందరూ షాక్ అయ్యారు.ఇదే తంతు పక్క రాష్ట్రమైన బీహార్ లో కూడా జరుగుతుంది..రైతన్నలు పెరిగారని సంతోషించాలో..ఇలాంటి పరిస్థితి వచ్చిందని భాద పడాలో అర్థం కావడం లేదు..