భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన, దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ ఈ నెల 15వ తేదీన పట్టాలెక్కనుంది. ఢిల్లీ, వారణాసి మధ్య ఈ రైలును నడపనున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ట్రెయిన్ 18 అని కూడా పిలుస్తారు. దీన్ని చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారుచేశారు. ఈ ట్రెయిన్ తయారీకి 18 నెలల సమయం మాత్రమే పట్టింది. కాగా ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు.
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ-వారణాసి మధ్య నడవనుండగా ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసికి మొత్తం 820 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటలలోనే చేరుకుంటుంది. సాధారణంగా అంత దూరం ప్రయాణించాలంటే 13 గంటలకు పైగానే సమయం పడుతుంది. కానీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా చాలా తక్కువ సమయంలోనే గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఈ రైలు కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ స్టేషన్లలో మాత్రమే ఆగనుంది.
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ 18) ఢిల్లీలో ఉదయాన్నే 6 గంటలకు బయల్దేరుతుంది. వారణాసికి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవచ్చు. మధ్యలో ఉదయం 10.20 గంటలకు కాన్పూర్ స్టేషన్‌లో, 12.25 గంటలకు ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) స్టేషన్‌లో ఈ రైలు ఆగుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో వారణాసి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఈ రైలు బయల్దేరి రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 18 కోచ్‌లు ఉంటాయి. మొత్తం ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లే. వాటిల్లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్స్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసికి చెయిర్ కార్‌లో రూ.1850 చార్జి అవుతుంది. క్యాటరింగ్‌కు కూడా కలిపే ఈ చార్జిలను వసూలు చేస్తారు. అలాగే వారణాసి నుంచి ఢిల్లీకి రూ.1795 చార్జి అవుతుంది. ఇందులోనూ క్యాటరింగ్ చార్జిలు కలిపి ఉంటాయి.
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి వారణాసికి ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ చార్జి రూ.3,520 అవుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో రూ.3470 చెల్లించాలి.
- ఈ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కానీ ఈ రైలును మాత్రం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడపనున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో కేవలం శతాబ్ది రైళ్లు మాత్రమే వేగంగా నడిచేవి. కానీ ఇకపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం శతాబ్ది రైలు వేగాన్ని మించనుంది.
- గతేడాది అక్టోబర్ 29వ తేదీన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) బయట ఈ రైలుకు ట్రయల్స్ నిర్వహించారు. ఇక ఈ రైలును భారత్‌లోనే తయారైన పరికరాలు, యంత్రాలతో రూపొందించారు. అదే బయటి నుంచి వాటిని తెప్పించుకుంటే ట్రెయిన్‌కు ఇప్పటికైన ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు అయి ఉండేది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తయారీకి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా.
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో లైటింగ్, ఆటోమేటిక్ డోర్స్, ఫుట్ స్టెప్స్, జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి ఆధునిక సదుపాయాలను అందిస్తున్నారు. ట్రెయిన్‌లో మొత్తం ఎల్ఈడీ విద్యుద్దీపాలనే అమర్చారు. ట్రెయిన్‌లో పూర్తిగా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ఉండే ప్లాట్‌ఫాం ఎత్తుకు అనుగుణంగా ఈ రైలు ఫుట్‌స్టెప్స్ అడ్జస్ట్ అవుతాయి. దీని వల్ల ప్రయాణికులు ఈ రైలును సులభంగా ఎక్కవచ్చు.
- ఈ రైలుకు రెండు వైపులా ఉన్న క్యాబిన్లలో డ్రైవర్లు ఉంటాయి. రైలులో వైఫై సేవలను కూడా ప్రయాణికులకు అందివ్వనున్నారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ రైలులో బయో వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల లగేజ్ కోసం, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలను ఈ రైలులో అందిస్తున్నారు. త్వరలో ఢిల్లీ నుంచి భోపాల్‌కు ప్రత్యేకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాలను కలిపే విధంగా మరిన్ని ట్రెయిన్ 18 రైళ్లను వినియోగంలోకి తేనున్నారు.