బొద్దింకలు ( Cockroaches ) అనేవి సహజంగానే చాలా మంది ఇళ్లలో ఉంటాయి. ముఖ్యంగా కిచెన్, బాత్రూమ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని చూస్తేనే కొందరికి శరీరంపై తేళ్లు, జెర్లు పాకినట్లు అవుతుంది. దీంతో భయాందోళనలకు గురవుతారు. అయితే ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటే అందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో బొద్దింకలు పారిపోతాయి. ఆ చిట్కాలు ఏమిటంటే..
* బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో కిరోసిన్‌తో తుడవాలి. లేదా కిరోసిన్ ను స్ప్రే చేయవచ్చు. దీంతో బొద్దింకలు నశిస్తాయి.
* లవంగాలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడమే కాదు, బొద్దింకలను కూడా తరిమేస్తాయి. ఫ్రిజ్, అల్మారాలు, ర్యాక్ లు, ఇతర ప్రదేశాల్లో లవంగాలను చిన్న పొట్లాల్లో వేసి ఉంచండి. బొద్దింకలు రావు. ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.
* బోరిక్ యాసిడ్, చక్కెరలను సమాన భాగాల్లో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న మొత్తాల్లో బొద్దింకలు తిరిగే చోట్లలో ఉంచాలి. దీంతో బొద్దింకలు రావు.
* ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో బోరిక్ పౌడర్‌ను చల్లాలి. దీని వల్ల కూడా బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.