సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన మోటార్ వాహన చట్టాన్ని అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు వాహనదారులకు ఒకే తరహా ఫైన్‌లు వేయనున్నారు. అయితే ఆ ఫైన్‌లు భారీ మొత్తంలో ఉండనున్నాయి.
వాహనదారులారా.. బహుపరాక్.. ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా.. రాంగ్ రూట్‌లో వెళ్లినా.. సిగ్నల్ జంప్ చేసినా.. ట్రిపుల్ రైడింగ్ అయినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా.. చాలా తక్కువ పెనాల్టీలు ఉన్నాయని చెప్పి.. చూసీ చూడనట్లు వెళ్లారు. కానీ ఇకపై అలా కుదరదు. ఎందుకంటే ముందు చెప్పిన ట్రాఫిక్ ఉల్లంఘనలే కాదు, ఇకపై ఏ ట్రాఫిక్ రూల్‌ను అతిక్రమించినా.. భారీగా జరిమానా చెల్లించాల్సిందే..!
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నూతన మోటార్ వాహన చట్టాన్ని ప్రకటించిన విషయం విదితమే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు వాహనదారులకు ఒకే తరహా ఫైన్‌లు వేయనున్నారు. అయితే ఆ ఫైన్‌లు భారీ మొత్తంలో ఉండనున్నాయి.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1వేయి, సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ.1వేయి, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు రూ.5వేలు, డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు రూ.10వేలు, ప్రమాదకరంగా వాహనం నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా రూ.5వేలు, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.5వేలు జరిమానా విధించనున్నారు. అలాగే పలు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా పెద్ద మొత్తంలో జరిమానా విధించనున్నారు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా నియమాలకు లోబడి వాహనాలు నడపి వాహనదారులు తమ డబ్బును ఆదా చేసుకోవాలంటూ పోలీసులు ఓ ఫ్లెక్స్‌ను తయారు చేసి రోడ్డుపై పెట్టించగా, అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా.. సెప్టెంబర్ 1 నుంచి మాత్రం వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది..!