హైదరాబాద్ లో నిన్న 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అది థార్ ఎడారి ఉష్ణోగ్రత (43.3) కన్నా ఎక్కువ కావడం గమనార్హం.
ఎండ దెబ్బకు జనాలు ఠారెత్తుతున్నారు. గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనాలు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరువ కావడంతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ నెల 26వ తేదీన ఆదివారం ఒక్క రోజే తెలంగాణలో ఏకంగా 16 మంది ఎండ దెబ్బ కారణంగా మృతి చెందారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఎండలు ఏ రకంగా ఉన్నాయో. ఇక తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. బయటకు వద్దామంటేనే ప్రజలు జంకుతున్నారు.
తెలంగాణలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) తెలిపింది. అలాగే హైదరాబాద్ లో నిన్న 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అది థార్ ఎడారి ఉష్ణోగ్రత (43.3) కన్నా ఎక్కువ కావడం గమనార్హం. అదేవిధంగా తెలంగాణలో పలు ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల విషయానికి వస్తే…
జగిత్యాలలో 47 డిగ్రీలు, వరంగల్ అర్బన్‌లో 46,9, సిరిసిల్లలో 46.8, నిజామాబాద్‌లో 46.4, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో 46 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 45.3, వరంగల్ రూరల్‌లో 45.1, ఖమ్మం, మహబూబ్ నగర్‌లలో 45, వికారాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో 1952 జనవరి 29న నమోదైన 48.6 డిగ్రీల ఉష్ణోగ్రతే అధికం కావడం విశేషం. అది కూడా భద్రాచలంలోనే ఈ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 1898 జనవరి 12వ తేదీన హన్మకొండలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. ఈ క్రమంలో నిన్న మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయట. అందువల్ల పగటి పూట అస్సలు బయటకు రాకూడదని, వస్తే తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలని వాతావరణ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.