సాధారణంగా ఇళ్లమధ్యలోంచి డివైడర్ లైన్ పోయిన వార్తలు విని ఉంటాం.. బెడ్‌రూమ్ ఒక దేశంలో ఉంటే..బాత్రూమ్ ఇంకో దేశంలో ఉంటుంది.. కానీ ఒకే రోడ్డుపై రెండు దేశాలు ఉండటం మీరెప్పుడైనా చూశారా..పైగా ఈ రోడ్డు దాటాలంటే..పాస్‌పోర్డు ఉండాలట.. రోడ్డు దాటాలంటే ఎక్కడైనా పాస్‌పోర్డు కావాలనే రూల్ పెడిటే..రూల్‌తోనే కాదు.. పాటించకపోతే జరిమానా వేస్తారట..! ఆ దేశాలే అమెరికా(America)-కెనడా(Canada) . అమెరికా ఉత్తర సరిహద్దు చాలా వరకు కెనడాతో పంచుకుంటుంది. 9వేల కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దు.. ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ సరిహద్దుగా ఇది పేరు పొందింది.
ఈ రెండు దేశాల మధ్య 100కు పైగా బార్డర్ క్రాసింగ్స్ ఉన్నాయి. అందులో 15 అమెరికా రాష్ట్రమైన వెర్మోంట్, కెనడా ప్రావిన్స్‌లోని క్యూబెక్ మధ్య ఉన్నాయి. వీటిలో అమెరికాలోని డెర్బైలైన్ పట్టణం, కెనడాలోని స్టాన్‌స్టెడ్ పట్టణాల మధ్య ఉన్న బార్డర్ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సరిహద్దు ఇళ్లను మాత్రమే కాదు అర కిలోమీటరు వరకు రోడ్డును కూడా విభజిస్తూ ఉంటుంది. దీనిని కానుసా స్ట్రీట్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ ఇరుగుపొరుగు సైతం వేర్వేరు దేశాలకు చెందిన వారే..
కెనడాలో న్యూ ఫ్రాన్స్, ద ఫ్రెంచ్ కాలనీలను బ్రిటిష్ వారు ఆక్రమించారు. ఆ రెండు వలస రాజ్యాల గవర్నర్లు తమ సరిహద్దులను నిర్ణయించాల్సిందిగా సర్వేయర్లను పెట్టుకోవడంతో.. ఈ తికమకకు బీజం పడింది. 1771-73 మధ్య కాలంలో సర్వేయర్లు 45 డిగ్రీల అక్షాంశానికి సమాంతరంగా ఓ గీత గీశారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారట…దాంతో కొన్ని చోట్ల సరిహద్దును కాదని 1.5 కిలోమీటర్ల మేర తప్పుగా గీసేశారు..1783లో అమెరికా రివల్యూషనరీ వార్ తరువాత ఈ బార్డర్‌పై ఒక సంధి మాత్రం కుదిరింది..
1800 సంవత్సరంలో కొందరు సర్వేయర్లు జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. సరిహద్దు అమెరికా దక్షిణ భాగానికి జరగాల్సి ఉందనే అంచనాకు వచ్చారు. అమెరికా, కెనడాలోని బ్రిటిష్ వలస రాజ్యాల మధ్య పలుమార్లు తలెత్తిన సరిహద్దు వివాదాలకు 1842లో ముగింపు పలకాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఎలా ఉన్న సరిహద్దులను అలాగే కొనసాగించాలని. ఆ తరువాత 1908లో యూకే, యూఎస్ కలిసి ఇంటర్నేషనల్ బౌండరీ కమిషన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటికే స్థానికులు సరిహద్దుపై పలు చోట్ల నిర్మాణాలు చేపట్టడంతో అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ బౌండరీ కమిషన్ తీవ్రంగా కృషి చేసి కొన్ని మార్గాలను గుర్తించింది.. కానుసా స్ట్రీట్‌ను మాత్రం ఏమీ చేయలేక వదిలేశారు.
అక్కడి ప్రజల జీవనం..
అమెరికా, కెనడా ప్రజలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా పంచుకుంటున్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా అటూఇటూ దాటుతుంటారు. స్టాన్‌స్టెడ్ నుంచి తాగునీరు, మురుగునీటి సరఫరా వంటి సౌకర్యాలు డెర్బైలైన్‌కు అందుతుంటాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా రెండు ప్రాంతాల్లో ఎక్కడ ముప్పు వాటిళ్లినా వెళ్తుంది..
రోడ్డు దాటాలంటే మాత్రం..
9/11 నుంచి అక్కడ భారీ మార్పులు వచ్చాయి. అప్పటి దాకా సులభంగా ఆ దేశానికి, ఈ దేశానికి మధ్య రాకపోకలు సాగించిన ప్రజలు ఆంక్షల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది…బార్డర్ క్రాసింగ్ ఆఫీసుల్లో సంప్రదించిన తరువాతే రోడ్డు దాటాలని షరతులు పెట్టారు..ఇరుగుపొరుగు ప్రజల్ని కలిసేందుకు సైతం అనుమతి తీసుకోవాల్సిందే.. చెక్ పాయింట్ వద్ద తప్పనిసరిగా పాస్‌పోర్టు చూపించిన తరువాతే రోడ్డు దాటాలని నిబంధన పెట్టారు. ఒక వేళ డ్రైవింగ్ చేస్తుంటే వాహనానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలట..
ఆంక్షల్ని పట్టించుకోకుండా రోడ్డు దాటితే మాత్రం భారీగా జరిమానా విధిస్తారు.. అమెరికాలో అయితే 5వేల డాలర్లు లేదా రెండేళ్ల జైలు శిక్ష, కెనడాలో అయితే వెయ్యి డాలర్లు జరిమానా విధిస్తారు. 2015 పిజ్జా కొనడానికి రోడ్డు దాటి ఓ వ్యక్తి అరెస్టయ్యాడంటే అక్కడి పరిస్థితి ఎంత కఠినంగా ఉందో మీరే ఆలోచించండి.. అయితే ఈ ప్రాంతంలో నివసించే చాలా మందికి రెండు దేశాల్లోనూ ద్వంద్వ పౌరసత్వం ఉంది. దాంతో వారు చాలా సులభంగా రాకపోకలు సాగిస్తుంటారు.