నేటి తరానికి తెలుగు భాష తియ్యదనం తెలియకపోవచ్చు.. తెలుగు భాష పరిజ్ఞానం ఉండకపోవచ్చు. అసలు తెలుగు భాష ప్రాధాన్యమే వాళ్లకు తెలియదు. ఈ తరానికి తెలుగు గురించి ఎక్కువగా పరిచయం చేయని తల్లిదండ్రుల తప్పు కానీయండి.. టీచర్ల తప్పు కానీయండి.. ఇంకెవరి తప్పు కానీయండి.. కానీ తెలుగు భాషను నేటి తరం మరిచిపోతున్నదనేది మాత్రం కాదనలేని సత్యం. కానీ.. తెలుగు భాష ప్రాధాన్యాన్ని గుర్తించిన నేటి తరం యువతి మాత్రం తెలుగు భాష కోసం తను చేయాల్సినదంతా చేసింది. ఎవరూ చేయని పని చేసి ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నది. తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంతకీ ఏం చేసిందీమె అంటారా?
ఆమె పేరు పారుపల్లి శ్రీకవిత. ఐఐఐటీ హైదరాబాద్ లో రీసెర్చ్ స్టూడెంట్. దాదాపు 21 వేల ప్రాచీన తెలుగు పదాలను ఇంటర్నెట్ లో పొందుపర్చింది. అదే ఆమె తెలుగుకు చేసిన సేవ. నిజానికి సాధారణంగా మనం రోజూ తెలుగులో ఉపయోగించే పదాలు ఇంటర్నెట్ లో కేవలం 9 వేలే ఉన్నాయట. అందుకే దాదాపు మూడు నెలలు కష్టపడి మొత్తం 21 వేల ప్రాచీన తెలుగు పదాలను సమకూర్చి ఇంటర్నెట్ లో పొందుపర్చిందట. దానికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఆమె సమర్పించి చరిత్రకెక్కింది. దీంతో ఆమెను తెలుగు భాషాభిమానులు తెగ పొగుడుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో బిజీబిజీగా గడుపుతూ తెలుగంటేనే తెలియని ఈ జనరేషన్ లో పుట్టి తెలుగుకు ఇంత సేవ చేసిన కవితకు చేతులెత్తి మొక్కాల్సిందే.