ప్రతి ఏటా విడుదలయ్యే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఈ సారి కూడా విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ ర్యాంకింగ్స్ లో ఐఐటీ బాంబేకు టాప్ 50లో చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐఐటీ బాంబే 49వ ర్యాంకును సాధించింది. ఇక టాప్ 200లో దేశంలో ఉన్న మరో 7 ఇంజినీరింగ్ కాలేజీలు నిలిచాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీగా ఐఐటీ బాంబే నిలిచింది.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ 2021 జాబితా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐఐబీ బాంబే 49వ ర్యాంక్‌ను సాధించగా ఐఐటీ ఢిల్లీ 54, ఐఐటీ మద్రాస్ 94, ఐఐటీ ఖరగ్‌పూర్ 101, ఐఐఎస్‌సీ బెంగళూరు 103, ఐఐటీ కాన్‌పూర్ 107, ఐఐటీ రూర్కీ 176, ఐఐటీ గువాహటి 253, అన్నా యూనివర్సిటీ 388వ ర్యాంక్‌ను సాధించాయి.
ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీగా మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ స్థానంలో ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న ఆ కాలేజీ ఈసారి కూడా ఆ స్థానాన్ని పదిల పరుచుకుంది. ఇక ఎంఐటీ తరువాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, యూఎస్ (2), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, యూకే (3), ఈటీహెచ్ జ్యురిచ్ – స్విస్ ఫెరడల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, స్విట్లర్లాండ్ (4), నన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సింగపూర్ (5), యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూకే (6), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ (7), ఇంపీరియల్ కాలేజ్ లండన్ (8), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (9), త్సింగువా యూనివర్సిటీ, చైనా (10)లు వరుస స్థానాల్లో నిలిచాయి.
ఆయా ఇంజినీరింగ్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, విద్యా బోధన విధానాలు, జరిగిన రీసెర్చి వంటి అనేక అంశాల ఆధారంగా ఇంజినీరింగ్ కాలేజీలకు ర్యాంకింగ్‌లు ఇస్తుంటారు. అలాగే ఈ సారి కూడా ఇచ్చారు.