టెలికాం రంగంలో జియో ఎన్ని సంచనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. ఆరంభం నుంచే ప్రత్యర్థి టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు పుట్టించింది. అదిరిపోయే ఆఫర్లను, ప్లాన్లను అందిస్తూ కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ అందరినీ తన వైపుకు తిప్పుకుంది. జియో ధాటికి ఇతర టెలికాం కంపెనీలు ఇప్పటికీ నిలవలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎవరికీ అంతుబట్టని విధంగా జియో ఇప్పుడు టెలికాం రంగంలో ముందుకు సాగుతూ 2 వసంతాలను పూర్తి చేసుకుంది.
2016 సెప్టెంబర్ 5వ తేదీన జియో 4జీ సేవలు ప్రారంభం కాగా.. అప్పట్లో మార్కెట్లోకి జియో సంచనంలా దూసుకువచ్చింది. జియో సేవలు ప్రారంభం అయ్యాక మొబైల్ డేటా ధరలు భారీగా తగ్గాయి. ఒకప్పుడు 1జీబీ 3జీ డేటా కావాలంటే రూ.255 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడదే మొత్తానికి అధికంగా మొబైల్ డేటా లభిస్తోంది. ఇదంతా జియో చలవే. ఇక జియో రాకతో భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్‌ను వాడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జియో కస్టమర్లే నెలకు 240 కోట్ల జీబీ డేటాను ఉపయోగిస్తుండగా, ఇతర అన్ని టెలికాం కంపెనీలకు చెందిన కస్టమర్లు కలిసి నెలకు 370 కోట్ల జీబీ డేటాను వాడుతున్నారు.
కేవలం డేటాకు మాత్రమే చెల్లించండి, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఉచితం.. అంటూ మార్కెట్‌లోకి అడుగు పెట్టిన జియో ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఏకంగా 21.5 కోట్ల కస్టమర్లను కలిగిన నెట్‌వర్క్‌గా ఎదిగింది. ఇక జియో ప్రభావం వల్ల సోషల్ మీడియా యాప్స్‌ను వాడే వారి సంఖ్య కూడా బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ రెండేళ్ల కాలంలో జియో సాధించిన ఘనతలు. ఇకపై త్వరలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా జియో అందివ్వనున్న నేపథ్యంలో ఇంకెన్ని ఆసక్తికర గణాంకాలు నమోదు అవుతాయో వేచి చూస్తే తెలుస్తుంది.