కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ఏడాది నుంచి మన దేశంలో కోవిడ్ టీకాలను వేస్తున్నారు. అయితే అమెరికాలో గతేడాది నవంబర్‌లోనే ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అక్కడ వివిధ రకాల కంపెనీలకు చెందిన టీకాలను వేస్తున్నారు. అయితే సీసాలో ఉండే టీకా మొత్తం అయిపోయాక దాన్ని పడేస్తుంటారు. కానీ ఆ ఖాళీ సీసాలను ఆమె అందమైన ఆకృతిలో మలిచింది.
బౌల్డర్ కౌంటీకి చెందిన పబ్లిక్ హెల్త్ నర్స్ లారా వెయిస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయింది. అయితే పెద్ద ఎత్తున ప్రజలకు టీకాలు వేసేందుకు సిబ్బంది లేనందున ఆమెను మళ్లీ కొంత కాలం పాటు విధుల్లో చేరాలని కోరారు. ఇందుకు ఆమె అంగీకరించింది. అందులో భాగంగానే ఆమె రోజూ టీకాలను వేసేది.
అయితే పనిలో భాగంగా ఖాళీ కోవిడ్ టీకా సీసాలు పెద్ద ఎత్తున పేరుకుపోవడాన్ని ఆమె చూసింది. దీంతో వాటిని ఆమె సేకరించి అందమైన షాండ్లియర్‌గా మలిచింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తనలాంటి ఎంతో మంది వైద్య సిబ్బంది ఈ కష్ట సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని, వారందరి గౌరవార్థం తాను ఇలా ఖాళీ కోవిడ్ టీకా సీసాలతో షాండ్లియర్‌ను రూపొందించానని ఆమె తెలియజేసింది.
కాగా సదరు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వారు ఆమె రూపొందించిన షాండ్లియర్‌ను ప్రజలు చూసేందుకు డిస్‌ప్లే పెట్టారు. అలాగే ఆ షాండ్లియర్ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమె కళాభిరుచిని ప్రశంసిస్తున్నారు.