గాడిదల మీద ఎక్కితే అంతే.. ఊచలు లెక్కబెట్టాల్సిందే..!

-

గాడిద చేసిన చాకిరీ ఎవరూ చేయలేరంటారు. గాడిదకు ఎంతో ఓర్పు ఉంటుంది. ఊళ్లలో చాలా మంది గాడిదలను వస్తువులను, మనుషులను మోయడానికి ఉపయోగిస్తుంటారు. కొండ ప్రాంతాలు ఎక్కలేనివాళ్లు కూడా గాడిదల సాయం తీసుకుంటుంటారు.

అయితే.. గాడిదలకు కూడా హక్కులుంటాయండోయ్. వాటిని ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకుంటామంటే కుదరదు. గ్రీస్ లోని శాంతోరినీ ఐలాండ్ లో అయితే గాడిదలకు ఫుల్లు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే.. అక్కడికి వెళ్లే టూరిస్టులు అక్కడి ప్రకృతిని ఆస్వాదించాలంటే కొండపైకి ఎక్కాల్సిందే. కానీ.. కొండపైకి ఎక్కడం అంత ఈజీ కాదు. దీంతో గాడిదల మీద కూర్చొని ఆప్రాంతమంతా తిరిగి ఎంజాయ్ చేస్తుంటారు టూరిస్టులు.

తక్కువ బరువు ఉన్నవాళ్లు గాడిదల మీద సవారీ చేస్తే పర్లేదు కానీ.. అధిక బరువు ఉన్నవాళ్లు, భారీకాయులు గాడిదల మీద ఎక్కి వెళ్తుండటంతో అవి మొరాయిస్తున్నాయట. భారీకాయులను మోసుకెళ్లడం వల్ల వాటి వెన్నుముక పాడవుతున్నదట. వాటి ఆరోగ్యం దెబ్బతింటున్నదట. దీంతో వాటి యజమానులు వాటికి చికిత్స చేయించలేక చేతులెత్తేస్తున్నారట. ఈ విషయం గ్రీస్ ప్రభుత్వానికి తెలియడంతో.. గాడిద హక్కులను ఓసారి తిరగేసింది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

భారీకాయులు గాడిద మీద స్వారీ చేయకూడదని… వాటికి సరైన ఆహారం పెట్టాలని.. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని.. 100 కిలోల కంటే ఎక్కువ బరువు వాటి మీద వేయకూడదని తేల్చింది. ఈ రూల్స్ ను అతిక్రమించినవాళ్లు ఊచలు లెక్కబెట్టాల్సిందే అని వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లే టూరిస్టులు కాస్త బెరుకుగానే ఉంటున్నారట. గాడిదల మీద ఎక్కితే ఎక్కడ ఊచలు లెక్కబెట్టాల్సివస్తుందేమోనని కొండప్రాంతాలను నడుచుకుంటూ వెళ్తున్నారట. దీంతో గాడిద యజమానులకు పనిలేకుండా అవుతున్నదట. గాడిద వ్యాపారుల పాలిట శాపంగా మారింది కదా ఆ రూల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version