అలా మొదలైంది.. ఆలూ చిప్స్ ప్రస్థానం…!

574

మీకు ఇష్టమైన స్నాక్స్ ఏంటి.. అని 100 మందిని అడిగితే.. అందులో 90 మంది ఆలూ చిప్స్ అని టక్కున చెప్పేస్తారు. అది ఆలూ చిప్స్ కు ఉన్న డిమాండ్. తింటున్నా కొద్దీ తినాలి అనిపించే ఈ ఆలూ చిప్స్ అసలు ఎలా పుట్టాయో తెలుసా? ఏమో.. వాటిని చూస్తే తినాలిపిస్తుంది కానీ.. ఎప్పుడూ అవి ఎక్కడ పుట్టాయి అని తెలుసుకోవాలనిపించలేదు.. అని అంటారా? అయితే.. కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి అవి ఎలా పుట్టాయో.. ఎక్కడ పుట్టాయో.. ఎందుకు పుట్టాయో….

అది న్యూయార్క్.. 1853 వ సంవత్సరం. జార్జ్ క్రమ్ అనే వ్యక్తి రిసార్ట్ కు వెళ్లాడు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే.. ఫ్రెంచ్ ఫ్రైస్ సన్నగా ఉన్నాయని ఆ కస్టమర్ రిసార్ట్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో రిసార్ట్ చెఫ్.. ఆ కస్టమర్ కు మంచి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. దీంతో ఆలు గడ్డలను సన్నగా కోసి కరకరలాడేవరకు వేయించాడు. అనంతరం దానిపై ఉప్పు చల్లి ఆ కస్టమర్ కు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా.. ఓసారి తిని చూద్దామని ఆ కస్టమర్ వాటిని నోట్లో వేసుకున్నాడు. అంతే.. ఆ చిప్స్ తెగ నచ్చాయి ఆ కస్టమర్ కు. దీంతో ఆ రిసార్ట్ కు కస్టమర్లు క్యూ కట్టారు. తర్వాత ఆ చిప్స్ కు సరటోగా చిప్స్ అని పేరు పెట్టి ఆ రిసార్ట్ మెనులో ఎక్కించారు.

అలా అలా ఆలూ చిప్స్ కు గిరాకీ కూడా పెరగడం స్టార్ట్ అయింది. వాటికి వివిధ రకాల ఫ్లేవర్స్ యాడ్ చేయడం ప్రారంభించారు. చీజ్, ఆనియన్, సాల్ట్, వెనిగర్ ఇలా రకరకాల చిప్స్ ను తయారు చేయడం మొదలుపెట్టారు. ఒక్క ఆ రిసార్టే కాదు.. అన్ని హోటళ్లూ ఆ చిప్స్ ను తయారు చేయడం ప్రారంభించాయి. వాటిని నిలువ ఉంచడానికి గాజు సీసలను వాడేవారు అప్పట్లో. ఆ గాజు సీసల్లో అవి మెత్తబడి పోతుండటంతో.. ఎక్కువ కాలం మన్నేలా ప్యాకింగ్ చేయడం ప్రారంభించారు. అలా.. అలా.. ప్రస్తుతం మనం ప్యాకెట్లలో కొనుక్కొని తినే స్థాయికి ఎదిగాయి ఆలూ చిప్స్. బాగుంది కదా ఆలూ చిప్స్ ప్రస్థానం.