ప్రస్తుత సోషల్ మీడియా సమాజంలో అన్నీ అవతలి వాళ్లకు చెప్పడం అలవాటుగా మారిపోయింది. అలవాటులో పొరపాటుగా తమ గురించి ప్రతీదీ చెప్పేస్తున్నారు. అలా చెప్పే వాళ్ల గురించి పక్కన పెడితే తమ గురించి అన్నీ చెప్పకుండా కొన్ని దాచేస్తే ఎన్ని లాభాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
మానసిక ప్రశాంతత:
జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకోవడం వల్ల ముఖ్యంగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ప్రతీదీ చెప్పేయడం వల్ల అవతలి వాళ్ళ అభిప్రాయాలను వినాల్సి ఉంటుంది. దాచుకోవడం వల్ల అలాంటి టెన్షన్ ఉండదు. ఒత్తిడిని జీవితంలో భాగం చేసుకున్న ప్రస్తుత సమయంలో ప్రశాంతత ఎంత అవసరమో చెప్పాల్సిన పనిలేదు.
నీ మీద నీకు కంట్రోల్ ఉంటుంది:
జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకోవడం వల్ల నీ మీద జనాలకు ఒక అంచనా ఉండదు. నీ గురించి ఎక్కువగా విషయాలు తెలియవు కాబట్టి నీ గురించి నువ్వే చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల తప్పుడు సమాచారం అవతలి వాళ్లకు వెళ్లే దారి ఉండదు.
బంధాలు పదిలం:
ఫాలోవర్స్ ని దృష్టిలో పెట్టుకుని అన్నింటినీ బయటకు చెప్పేస్తూ పోతే మనతో ఉన్న వాళ్ళతో బంధం పలుచన పడే అవకాశం ఉంది. లైఫ్ ని ప్రైవేట్ గా ఉంచుకుంటే మనతో ఉండే వాళ్ళతో బంధం స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా చెప్పుకోవడానికి మీకంటూ ఒక స్నేహం లేదా బంధం ఉంది. అందరికీ చెప్పాల్సిన పని లేదు.
భయం ఉండదు:
అందరికీ అన్ని తెలియడం వల్ల వాళ్లు ఏమనుకుంటారో నన్న భయం ఉంటుంది. ప్రైవేట్ గా జీవించే వాళ్లకు ఆ భయం కొంచెం కూడా ఉండదు. ఈ విషయంలో మంచి స్వేచ్ఛ ఉంటుంది.