ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఇంటా, బయటా స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారు. దీంతో ఆస్తమా వంటి శ్వాస కోశ సమస్యలను తెచ్చుకుంటున్నారు. అయితే ఇళ్లలో కింద తెలిపిన పలు మొక్కలను పెంచడం ద్వారా గాలి కాలుష్యం తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. గాలి శుభ్రంగా మారుతుంది. మరి ఆ మొక్కలు ఏమిటంటే…

1. కలబంద మొక్కను ఆయుర్వేద ఔషధంగా ఉపయోగించడం కోసం పెంచుకుంటారు. కానీ దీన్ని ఇంట్లో పెంచడం వల్ల గాలి శుభ్రమవుతుంది. గాలిలో ఉండే బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌, కార్సినోజెన్లు తొలగిపోతాయి. ఇంట్లో అలొవెరా మొక్కలను బెడ్‌రూమ్‌లలో పెట్టుకోవచ్చు. దీని వల్ల కార్బన్‌ డయాక్సైడ్‌ను అవి పీల్చుకుని ఆక్సిజన్‌ను వదులుతాయి. మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.

2. జెర్‌బెరా డెయిసీ అనే మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది గాలిలోని బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటి కాలుష్య కారకాలను తొలగించి గాలిని శుభ్రంగా మారుస్తుంది.

3. పీస్‌ లిల్లీ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల రసాయన బిందువులు, ఎసిటోన్‌, అమ్మోనియా, బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌, జైలీన్‌ వంటివి గాలి నుంచి తొలగిపోతాయి. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇంట్లో తేమ శాతం పెరుగుతుంది. పొడి వాతావరణం ఉన్నప్పుడు ఇది మేలు చేస్తుంది.

4. గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్‌ను తొలగించడంలో రబ్బర్‌ ప్లాంట్‌ కూడా మేలు చేస్తుంది. వీటిని ఇంట్లో పెంచుకుంటే గాలి శుభ్రంగా మారుతుంది. అయితే వీటికి సూర్యకాంతి కావాలి కనుక కిటికీల దగ్గర పెడితే మంచిది.

5. గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్‌, ట్రైక్లోరోఎథిలీన్‌ వంటి కాలుష్య కారకాలను స్నేక్‌ ప్లాంట్‌ తొలగిస్తుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల రాత్రి పూట గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. దీన్ని బెడ్‌రూమ్‌లలో పెంచుకోవచ్చు.

6. ఇంట్లో పెంచుకోదగిన మొక్కల్లో వీపింగ్‌ ఫిగ్‌ కూడా ఒకటి. ఇది ఫార్మాల్డిహైడ్‌, టోలీన్‌, జైలీన్‌లను గాలి నుంచి తొలగించి గాలిని శుభ్రంగా మారుస్తుంది. సూర్యకాంతి దీనికి కొద్దిగా తగిలినా చాలు పెరుగుతుంది. కానీ తరచూ నీటిని పోయాల్సి ఉంటుంది.