సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో విపక్షాలకు గొంతే లేకుండా చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ నినాదాలని చెప్పారు.
దేశంలో కాంగ్రెస్ బలోపేతంతోనే ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని స్పష్టం చేశారు. దేశంలో మతపరమైన విభజన సృష్టించి బీజేపీ రాజకీయ లబ్దిపొందాలని చూస్తోందన్నారు. న్యాయ వ్యవస్త పై కామెంట్ చేయలేని పరిస్తితి అని.. అన్ని రకాల స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ బలంగా ముందుకు సాగడం కచ్చితంగా అవసరం అన్నారు. అది ప్రజలకు, భావి తరాలకు కూడా అవసరమని తాను స్పష్టం చేస్తున్నానని తెలిపారు.