పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తరువాత 2018లో మన దేశంలో దాదాపుగా 11 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారని సీఎంఐఈ చేసిన సర్వేలో తెలిసింది.
నిరుద్యోగ సమస్య అన్నది మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నదే. ప్రతి ఏటా ఈ సమస్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల్లో ఏ చిన్న పోస్టుకు నోటిఫికేషన్ పడినా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఆ దరఖాస్తులు చేసుకునేది కూడా డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కావడం విశేషం. చాలా తక్కువ స్థాయి విద్యార్హత అవసరం అని తెలిసినా సరే.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా చిన్న చిన్న పోస్టులకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ పలు షాకింగ్ విషయాలను తాజాగా వెల్లడించింది. అవేమిటంటే…
ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగ రేటు 7.2 శాతంగా ఉంది. 2016 సెప్టెంబర్ నుంచి గడిచిన ఫిబ్రవరి నెల వరకు ఈ గణాంకాలు నమోదయ్యాయి. 2018 ఫిబ్రవరి నెలలో నిరుద్యోగ రేటు 5.9 శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడది 7.2 శాతానికి చేరుకుంది. దీన్ని బట్టే చెప్పవచ్చు, మన దేశంలో ఏటా నిరుద్యోగుల సంఖ్య ఎలా పెరిగిపోతుందో..! సీఎంఐఈ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది.
ఇక ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ అనే మరో సంస్థ చేసిన సర్వే ప్రకారం.. గతేడాది ఫిబ్రవరి నాటికి మన దేశంలో 406 మిలియన్ల మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరికి ఉద్యోగుల సంఖ్య 400 మిలియన్లు మాత్రమే ఉంది. అంటే ఏడాది కాలంలో 6 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారని ఇట్టే స్పష్టమవుతుంది. అయితే మన దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ తీవ్రతరమవుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు చాలా చేసిందని చెప్పుకొస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్ ప్రగతి సాధిస్తుందని, గత నాలుగు సంవత్సరాల కాలంలో 6 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉపాధి పొందారని ఆయన తాజాగా తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం వేరేగా ఉంది.
కాగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తరువాత 2018లో మన దేశంలో దాదాపుగా 11 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారని సీఎంఐఈ చేసిన సర్వేలో తెలిసింది. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల అంతా లాభమే జరిగిందని చెబుతూ మాట దాటేస్తున్నారు కానీ.. వాటి ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయారనే విషయంపై మాత్రం నోరు మెదపడం లేదు. నోట్ల రద్దు వల్ల ఎక్కువగా చిన్న తరహా పరిశ్రమలపై ప్రభావం పడిందని, అందుకే చాలా మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందని సీఎంఐఈ తెలిపింది. ఈ క్రమంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ముందు ముందు నిరుద్యోగుల సమస్య మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంది..!