ఉత్సవ్‌రాక్‌ గార్డెన్‌: కళలకు కేరాఫ్ అడ్రస్.. పల్లె సంస్కృతిని బొమ్మల రూపంలో దింపేశారుగా..!

-

ఊరన్నాక.. మనుషులు ఉండటం కామన్.. కానీ.. ఊరంతా బొమ్మలే ఉంటే.. అది కదా హైలెట్.. మీరు ఆ ఊర్లోకి వెళ్తే.. ఎటూ చూసినా బొమ్మలే.. బొమ్మలే కదా అని లైట్ తీసుకుంటారేమో.. అసలు మీరు అవి బొమ్మలు అని కూడా తవ్రగా గుర్తుపట్టలేరు. అచ్చం మనుషులు కుర్చున్నట్లు, పనిచేసుకుంటున్నట్లు.. ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లు ఉంటాయి. వీటిని చూసేందుకు లక్షలాదిమంది వస్తుంటారు. దీని పేరే.. ఉత్సవ్ రాక్ గార్డెన్. ఈరోజు మనం ఈ మాయాప్రపంచం గురించి తెలుసుకుందాం..

కర్ణాటకలోని హవేరీ జిల్లా గోటగోడిలో ఉన్న బొమ్మల ఊర్లో.. ఎన్నో విశేషాలుంటాయి. దీని పేరు.. ఉత్సవ్‌రాక్‌ గార్డెన్‌…చూడ్డానికి పెద్ద ఊరంత ఉంటుందీ మ్యూజియం. అన్నింటికీ మించి మన పల్లెజీవితం, భారతీయ సంస్కృతిని తెలిపే బొమ్మలు అచ్చంగా నిజమేనా అనేలా ఉంటాయి. ఈ ఉత్సవ్‌రాక్‌గార్డెన్‌ రూపకర్త డా.టి.బి.సొలబక్కనవర్‌. ‘డబ్బు కడుపు నింపుతుంది. కళ హృదయాన్ని నింపుతుంది’ అని బలంగా నమ్మిన కళాకారుడాయన. ఆయన ఆశయాలని వారసత్వంగా అందుకున్న ఆయన కూతురు వేదరాణి కూడా కళాశాలలో చేస్తున్న ఉద్యోగాన్ని కాదనుకుని.. 2009 నుంచి ఉత్సవ్‌ రాక్‌గార్డెన్‌ బాధ్యతలు తీసుకుని దేశం దృష్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు.

కళాకారులని బతికించే బృహత్తర బాధ్యతనీ ఆమె తీసుకున్నారు. కర్ణాటకలోని హుబ్బళ్లి వేదరాణి స్వస్థలం. ఎంఏ ఇంగ్లీష్ చదివిన ఈమె.. తండ్రి నుంచి అనేక కళానైపుణ్యాలనీ అందుకున్నారు. భర్త ప్రకాష్‌ దసనూరుతో కలిసి కళని బతికించడం కోసం ఉత్సవ్‌రాక్‌ గార్డెన్‌ సమితి అనే సంస్థ ఏర్పాటు చేశారు.

ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు లేదా కళలో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే.. ఈ సంస్థలో ఆరు నెలల పాటు స్టైపెండ్‌ తీసుకుంటూ, శిక్షణ తీసుకోవచ్చు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఆర్ట్‌ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావొచ్చు. ఉత్సవ్‌ రాక్‌గార్డెన్‌ సమితిని ప్రారంభించి కళాకారులకి పని ఉన్నా లేకపోయినా కొంత వేతనాన్ని అందిస్తూ వారికి అండగా ఉంటున్నారు. కరోనా సమయంలోనూ ఈ సమితి సభ్యులంతా వేతనాలు అందుకున్నారంటే మీరే ఆలోచించండి..

ఇంతవరకూ 600 మంది కళాకారులకు అండగా నిలిచారు. కళలను రక్షించేందుకు ఆర్ట్‌ మ్యూజియమ్‌లు, చిత్ర ప్రదర్శనలను నిర్వహించి ఆ కళారూపాల వెనుక ఉన్న కళాకారుల కృషిని ప్రచారం చేస్తోంది.. వేదరాణి… గ్రాఫిక్‌, డిజిటల్‌ సాంకేతికతకు చోటివ్వకుండా అచ్చంగా కళాకారుల చేతి నుంచి జాలువారిన రూపాలకే పెద్దపీట వేస్తూ, ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.

రాక్‌గార్డెన్‌లో గ్రామీణ వాతావరణం, ఉమ్మడి కుటుంబ నేపథ్యం, జానపద, నృత్య కళారూపాలకే ప్రాధాన్యత ఇస్తుంటారామె. భారతీయ శిల్ప కళా సౌందర్యానికి మరింత వన్నెలద్దేందుకు లండన్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని మ్యూజియమ్‌లను సందర్శించారు. విదేశీ కళా మ్యూజియంలలో దాదాపు 30శాతం కళారూపాలకు భారతీయ ప్రాచీన కళలే స్ఫూర్తే అంటున్నారు వేదరాణి. త్వరలో తల్లీబిడ్డల స్ఫూర్తితో ప్రదర్శన చేయనున్నారు. ఇందుకోసం 200మంది కళాకారులని ఎంపిక చేస్తున్నారు. లాభ నష్టాలు ఆలోచించకుండా.. కళల రక్షణ కోసం కృషి చేస్తున్న వేదరాణి సేవలను కర్ణాటక ప్రభుత్వం ‘రాజ్యోత్సవ’ పురస్కారంతో అభినందించింది.

మీరు కర్ణాటక వెళ్తే.. ఈ ప్లేస్ ను చూడటం అస్సలు మిస్ కావొద్దు. మంచి అనుభవం పొందుతారు.

Read more RELATED
Recommended to you

Latest news