నోరు తెరుచుకుని నిద్రపోవడానికి కారణం ఏంటి.. అదైతే కాదు కదా..!

-

నిద్రసుఖమెరగదూ అంటారు.. రాత్రైతే చాలు అందరం నిద్రపోతాం.. కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో పడుకుంటారు. కొందరు గురక తీస్తూ..పక్కన వారికి కూడా నిద్రలేకుండా చేస్తారు. మరికొందరు బోర్లా పడుకుంటారు. మరికొందరు నోరు తెరిచి పడుకుంటారు. మీరు చూసే ఉంటారు.. నోరు తెరిచి నిద్రపోయేవాళ్లను.. అసలు నోరు తెరిచి ఎందుకు నిద్రపోతారు.. అలవాటా..? అనారోగ్యమా..? ఇలాంటి పరిస్థితిని స్లీప్ అప్నియా అంటారు. నిద్రలో శ్వాస అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి ఇది. అయితే అందరిదీ అదే సమస్య అని చెప్పలేం. స్లీప్ అప్నియా సమస్య లేకపోయినా, నోటి ద్వారా శ్వాస తీసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. శ్వాస నాళాల్లో అడ్డంకులు లేదా రద్దీ కారణంగా తరచుగా ఇలా చేస్తారు.
ముక్కు లోపల రక్త నాళాలు రక్తంతో నిండిపోయినపుడు వాపు, సంకోచానికి కారణమవుతుంది. దీనివల్ల.. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టంగా అవుతుంది. దాంతో..తెలియకుండానే నిద్రలో నోరు తెరిచి నోరు ద్వారా శ్వాస తీసుకుంటారు. ఇదొక్కటే కాదు.. ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా నోరు తెరిచి నిద్రపోతారు.. అవేంటంటే..

ఒత్తిడి, ఆందోళన

విపరీతమైన ఒత్తిడి, ఆందోళనకు గురికావడం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.. ఇలాంటి వారు రోజంతా నోటి ద్వారా శ్వాస పీల్చుకునే అవకాశం ఉంది. వాస్తవానికి, ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు శ్వాస వేగం కూడా పెరుగుతుంది, రక్తపోటు ఎక్కువవుతుంది. ఈ సందర్భంలో వారు తమ నోరు తెరిచి గాలి పీల్చుకుంటారు.

ఆస్తమా

ఊపిరితిత్తులలో వాపు వల్ల ఆస్తమా వస్తుంది. ఇది ఉన్నప్పుడు శ్వాస ఆడదు.. గురకకు కారణమవుతుంది. ఆస్తమా నయం కావడానికి చాలా సమయం పడుతుంది. శ్వాస నాళాల్లో రద్దీ చాలా నెమ్మదిగా తగ్గుతుంది కాబట్టి శరీరం మెల్లగా నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి అలవాటుపడుతుంది.

అలర్జీలు

నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి అలెర్జీలు మరొక సాధారణ కారణం. శరీరంలోకి ఏదైనా విదేశీ కణం ప్రవేశించినపుడు రోగనిరోధక వ్యవస్థ వెంటనే అప్రమత్తమై దానిపై దాడి చేస్తుంది. ఈ సందర్భంలో అలెర్జీ సంభవిస్తుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తులు వేగంగా ఊపిరి పీల్చుకుంటారు, అలెర్జీని తొలగించే ప్రయత్నంలో నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటారు.

జలుబు, దగ్గు..

ఇదైతే మనకు తెలిసిందే.. ముక్కుపట్టేసినప్పుడు నిద్రలో నోరు తెరిచి నోటి ద్వారానే శ్వాస తీసుకుంటాం.. అంతే కాకుండా జలుబుతో సైనస్ లాంటి జబ్బు వచ్చినా నోటితోనే ఊపిరి పీల్చుకుంటారు.

స్లీప్ అప్నియా

స్లీప్ అప్నియా అనేది ఒక వైద్య పరిస్థితి. ఈ సమస్యతో బాధపడేవారు రాత్రిపూట నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటారు. నిద్రలో శరీరంలోని ఎగువ వాయుమార్గం పదేపదే నిరోధించినప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఏర్పడుతుంది. ఇది గాలి ప్రవాహాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. ఇందులో డెంజరస్‌ ఏంటంటే.. బాడీకి శ్వాస కావాలనే సంకేతం కూడా మెదడుకు అందదు. మీకు కూడా ఈ సమస్య ఉంటే..కారణం ఏంటో తెలుసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version