మన చుట్టూ పరిసరాల్లో ఉండే పక్షులు, ఇతర జంతువులు ఎల్లప్పుడూ అపరిశుభ్రంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని జీవులు మాత్రం నిజానికి మనుషుల కన్నా శుభ్రంగా ఉంటాయి. నిత్యం అవి తమను తాము శుభ్రపరుచుకుంటుంటాయి. చాలా సమయాన్ని పరిశుభ్రంగా ఉండేందుకే వెచ్చిస్తాయి. ఈ క్రమంలోనే అలాంటి జీవులు కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ధ్రువపు ఎలుగుబంట్లు
ధ్రువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఎలుగుబంట్లు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తాయి. అవి ఎప్పటికప్పుడు మంచులో దొర్లుతూ లేదా నీళ్లలో ఈదుతూ శరీరాలను శుభ్రం చేసుకుంటాయి. డర్టీగా ఉండడం అంటే వీటికి నచ్చదు. అందువల్ల ఇవి ఎప్పుడూ శుభ్రంగా ఉండేందుకు యత్నిస్తాయి.
2. పందులు
బురదలో దొర్లే పందులను చూస్తే చాలా మంది అసహ్యించుకుంటారు. కానీ అందుకు కారణం ఉంది. పందులు తమ శరీరాన్ని చల్లబరుచుకునేందుకు, ఎండ నుంచి రక్షించుకునేందుకు, సూక్ష్మక్రిముల ద్వారా ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు బురదలో దొర్లుతాయి. అలాగే అవి నివాసం ఉండే ప్రాంతాల్లో మల విసర్జన చేయవు. చాలా దూరంగా వెళ్లి మల విసర్జన చేసి తిరిగి నివాసాలకు చేరుకుని నిద్రిస్తాయి. అందువల్ల పందులు కూడా శుభ్రతను పాటిస్తాయి. కానీ మనం మాత్రం వాటి గురించి తప్పుగా అర్థం చేసుకుంటాం.
3. పిల్లులు
పిల్లులు పుట్టినప్పటి నుంచే శుభ్రతను అలవాటు చేసుకుంటాయి. పుట్టిన పిల్లులను తల్లి పిల్లి తన నాలుకతో నాకుతూ శుభ్రం చేస్తుంది. 2 వారాలకు అవి అలా తమకు తాము చేసుకోవడాన్ని అలవాటు చేసుకుంటాయి. ఈ క్రమంలో పిల్లులు రోజులో 50 శాతం సమయాన్ని తమను తాము శుభ్రం చేసుకునేందుకే వెచ్చిస్తాయి. ఒక పిల్లి తన నాలుకతో తనను తాను లేదా ఇతర పిల్లలను నాకుతూ శుభ్రం చేసుకుంటాయి. డర్టీగా ఉండడం అంటే వీటికి కూడా నచ్చదు. అందుకనే శుభ్రతకు ఇవి ప్రాముఖ్యతను ఇస్తాయి.
4. పులులు
పులులు కూడా పిల్లి జాతికి చెందినవే. కనుక ఇవి కూడా పిల్లి అనుసరించిన విధానాలనే అనుసరిస్తాయి. కానీ ఇవి ఎక్కువగా నీళ్లలో ఉంటూ తమను తాము శుభ్రం చేసుకుంటాయి.
5. కుందేళ్లు
పిల్లుల్లాగే కుందేళ్లు కూడా తమను తాము శుభ్రం చేసుకుంటాయి. అయితే వీటికి నీటితో స్నానం చేయించరాదు. ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి. అదే అపరిశుభ్రంగా ఉన్న కుందేలు కనిపిస్తే అది అనారోగ్యంతో బాధపడుతుందని అర్థం. దీంతో వెంటనే డాక్టర్‌కు చూపించి చికిత్సను అందించాలి.
6. డాల్ఫిన్లు
భూమిపై మనుషుల తర్వాత అత్యంత స్మార్ట్ అయిన జీవుల్లో డాల్ఫిన్లు ఒకటి. ఇవి నీటిలోనే ఎల్లప్పుడూ ఉంటాయి కనుక అందులో ఉండే సూక్ష్మక్రిముల బారిన పడకుండా ఉండేందుకు గాను తమను తాము శుభ్రం చేసుకుంటాయి. సముద్రాల్లో ఉండే డాల్పిన్లు ప్లాంక్టన్, ఆల్గే వంటి మొక్కల ద్వారా తమ గాయాలను తామే మాన్చుకుంటాయి. వాటితో శరీరాన్ని శుభ్రం చేసుకుంటాయి.