పెళ్ళి తర్వాత ప్రేమ కనబడకపోవడానికి కారణం బాధ్యతలేనా?

-

ప్రేమ, పెళ్ళి.. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. నిజానికి ప్రేమతోనే పెళ్ళికి దగ్గరవుతారు. కానీ పెళ్ళయ్యాక ప్రేమగా ఉండలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా బంధాల్లో ఇది చోటు చేసుకుంటున్నదే. ప్రేమకి, పెళ్ళికి తేడా ఉండకూడదు. ప్రేమలో ఒక్కటైన మనస్సులకి శాస్త్ర ప్రకారం పెళ్ళి చేసుకుని ఒక్కటవుతుంటారు. అంటే అంతకుముందు ఉన్న ప్రేమని ఒక బంధంలోకి తీసుకువస్తారన్నమాట. ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. ప్రేమలో ఉండడం అంటేనే బంధంలో ఉన్నట్టు కదా! మళ్ళీ కొత్తగా బంధంలో దిగడం ఏంటీ అని.

ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరే ఉంటారు. అప్పటి వరకు ఎవరేం చేసినా సర్దుకుపోతుంటారు. బేబి బేబి, బంగారం బంగారం అంటూ బుజ్జగింపులు చేసే వాళ్ళు పెళ్ళయ్యాక వాటిని తగ్గిస్తుంటారు. పిల్లలు పుడితే ఇక పూర్తిగా తగ్గించేస్తారు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. మగవాళ్ళకి 30ఏళ్ళు వస్తున్నాయంటే, డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనీ, అందుకు డబ్బు ఎక్కువగా సంపాదించాలని అనుకుని, ప్రేమ గురించి పట్టించుకోవడం మానేస్తారు. కాలేజీలో ఉన్నప్పుడు చేసే చిలిపి పనులన్నీ ఒక వయసు వచ్చాక చేయడం కరెక్ట్ కాదనుకుంటారు. అందుకే, ప్రేమ ప్రకటించడం తగ్గించేస్తారు.

ఆ విధంగా పెరిగిన గ్యాప్ మెల్ల మెల్లగా పెద్దగా అవుతుంది. దానివల్లే ఇద్దరి అభిప్రాయాల్లో తేడాలు ఏర్పడడం మొదలవుతుంది. ఈ విషయంలో అమ్మాయిలు తప్పంతా అబ్బాయిల మీదే వేస్తుంటారు. అంతకుముందులా నేనుండలేనని చెబుతూ, దానికి బాధ్యతలే కారణం అని చూపుతాడు. కానీ, బాధ్యతలని చూసుకుంటూ ప్రేమగా ఉండొచ్చని అమ్మాయి అంటుంది. ఇది అమ్మాయిలకి సాధ్యం కూడా. ఇంట్లో పనంతా చేసుకుని, ఆఫీసుకు వెళ్ళి, ఇంటికి తిరిగొచ్చిన అమ్మాయి, పిల్లలని ఎలా ప్రేమగా చూసుకుంటుందో అలా ఉండవచ్చు కదా అనుకుంటుంది.

మొత్తానికి ఈ కన్ఫ్యూజన్లో ప్రేమ అన్న విషయం పక్కకి జరిగి అనేక విషయాలు మధ్యలోకి వచ్చేస్తాయి. వాటిని మధ్యలోకి రాకుండా ఉండనివ్వాలంటే ప్రేమించడం నేర్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news