అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది ప్రతీ ఒక్క హిందువు కల. ఈ విషయాన్ని అంగీకరించడానికి వివాదాలతో పని లేదు. ఒకరకంగా దీనిని హిందువులు తమ పరువుగా భావించిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ రామమందిర నిర్మాణం కోసం ఎందరో హిందువులు ఏళ్ళ తరబడి ఎదురు చూసారు. తీర్పులు ఎలా ఉంటాయి… ఏఏ సమస్యలు కోర్ట్ ప్రస్తావిస్తుంది అనే ఆందోళన తీర్పు వచ్చే వరకు కూడా ప్రజల్లో ఒకరకమైన భయం నెలకొంది. రాజకీయ పార్టీలకు ఇది ఒక వరం.
ముఖ్యంగా ఉత్తరభారత దేశంలో అయితే ఈ తీర్పు కోసం ఎందరో ఆసక్తిగా ఎదురు చూసారు. తమకు అనుకూలంగా తీర్పు రావడంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామమందిర నిర్మాణం కోసం రాముడి భక్తులతో పాటు హిందువులు కూడా ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక మహిళ అయితే రాముడి గుడి నిర్మాణం కోసం 27 ఏళ్ళ నుంచి ఉపవాసం ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌కు చెందిన ఉర్మిళా చతుర్వేది సంస్కృత ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.
ఆమెకు సరిగా 54 ఏళ్ళు ఉన్నప్పుడు 1992డిసెంబరు 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చి వేశారు. ఈ ఘటన తర్వాత ఆమెకు రాముడి గుడి నిర్మాణం జరుగుతుంది అనే ఆశ బలపడింది. అయితే అప్పుడు జరిగిన అల్లర్లు భారీగా ప్రజలు చనిపోవడం ఆమెను కలచి వేసింది. ఆ రోజు నుంచి రాముడి గుడి నిర్మాణం జరిగే వరకు తాను పాక్షిక ఉపవాసం ఉంటాను అంటూ ప్రతిన భూని, రామమందిర నిర్మాణం కోసం నిర్ణయం జరిగేదాకా పాలు, పళ్లు మాత్రమే తింటూ బ్రతికారు ఆమె. ప్రస్తుతం ఆమె వయసు 81 ఏళ్ళు. త్వరలోనే ఒక కార్యక్రమం నిర్వహించి ఉపవాసం నుంచి బయటకు వస్తారట.