కవిత: నా ప్రపంచం.

వేకువ జామున వెన్నెలింకా పూర్తిగా
వెళ్ళక ముందే బయలుదేరాను.

నా ప్రపంచం కోసం.. నాదైన ప్రపంచం కోసం.

ఊళ్ళన్నీ తిరిగాను.
అడవుల్ని గాలించాను.
కొండల్ని ఎక్కాను
కోనల్లో దూకాను
ప్రపంచ మొత్తం పదిసార్లు చుట్టొచ్చాను.

గుళ్ళూ గోపురాలూ, మసీదు, చర్చి అన్నింటా ప్రార్థించాను.

సప్త సముద్రాల మీద ప్రయాణం చేసాను.
నదీ తరంగాల డోలికల్లో నాట్యమాడాను.
సరస్సుల సొగసుల్ని సూర్యోదయంలో చూసాను.
పౌర్ణమి చండ్రుడి వెన్నెల వర్షంలో తడిసాను.
ఆరు రుతువుల సౌదర్యాన్ని అనుభవించాను.
ఆది మానవుల అద్భుత గుర్తుల్ని కనుగొన్నాను.
నక్షత్రాల మెరుపుల్ని దగ్గరగా చూసాను
ఆఖరికి అంతరిక్షంలో కూడా అడుగుపెట్టాను.

అంతా తిరిగి అలసిపోయి వచ్చిన నన్ను
నా భార్య, తన కౌగిలితో స్వాగతం పలికింది.

అప్పుడు

ఒక మెరుపు మెరిసింది
పదివేల విద్యుత్ తీగలు నాలో ప్రవహించాయి.
లక్ష కంపనాలు కంపించాను
కోటి వోల్టుల వెలుతురుతో వెలిగాను.

అప్పుడు నాకర్థమైంది.
ఇప్పటివరకు నేను చేసిన
ప్రయాణం అంతా వ్యర్థమని.

ఇంత నిశ్శబ్దం, ఇంత అందం, ఇంత ఆనందం
ఎక్కడా పొందలేదు.

నా ప్రపంచం ఎక్కడ ఉందని వెతికిన నాకు,
ప్రపంచమంతా తిరిగొచ్చాక కానీ అర్థం అవ్వలేదు.
అది తన కౌగిలిలోనే దాగుందని.

-శ్రీరామ్ ప్రణతేజ.