పాకిస్థాన్ ఉగ్రవాదంపై తీసుకుంటున్న ద్వంద్వ ధోరణిని అంతర్జాతీయ వేదికపై బహిర్గతం చేసేందుకు భారత్ మరోసారి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కశ్మీర్‌లో హింసకు పాల్పడుతున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలన్న డిమాండ్‌తో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి (UNSC) భారత్ ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపనుంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి TRF బాధ్యత వహించినప్పటికీ, UNSC అధికార ప్రకటనలో TRF పేరును చేర్చకుండా పాకిస్థాన్ అడ్డుపడిందని భారత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇది పాక్ ఉగ్రవాద సంస్థలకు గుప్త మద్దతు ఇస్తోందన్న అభిప్రాయానికి బలాన్నిస్తోంది.

TRF సంస్థ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఏర్పడినదిగా భారత ప్రభుత్వం భావిస్తోంది. లక్షిత హత్యలు, ఉగ్రవాదుల నియామకం, ఆయుధాల అక్రమ రవాణా వంటి చర్యలతో ఈ సంస్థ కశ్మీర్ ప్రాంతాన్ని అస్థిరత వైపు నెట్టుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1267 ప్రకారం ఏర్పాటు చేసిన ఐసిల్ మరియు అల్-ఖైదా ఆంక్షల కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో TRFను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని, దాని నేతలపై ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు విధించాలని భారత్ అధికారికంగా కోరనుంది.