ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్ పల్లి గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..ప్రజల ఇబ్బందులు తెలుసుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేర్చిందని అన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఆయిల్ పామ్ సాగు అనుకూలంగా ఉంటుందని అన్నారు.పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రభుత్వం టార్గెట్‌గా నిర్ణయించిందని అన్నారు.