మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలోని ఫెడరల్ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరారీ లో ఉన్న నిందితుడిగా షరీఫ్ ను ఫెడరల్ క్యాబినెట్ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేనందున లండన్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న నేపథ్యంలో పలుమార్లు ఆయన వైద్య నివేదికలు సమర్పించాలి అని కోరినప్పటికీ ఆయన సమర్పించని కారణంగా బెయిల్ నిబంధనలు ఉల్లంగించినారు అని భావించిన క్యాబినెట్ పై మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతఏడాది అక్టోబర్ లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం తో జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
దీనితో ఆయన మెరుగైన వైద్యం కోసం సోదరుడు,ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ తో కలిసి లండన్ కు వెళ్లారు. అయితే అక్కడే ఆయన మెరుగైన వైద్యం తీసుకుంటుండగా పలు మార్లు వైద్య నివేదికలు కోర్టుకు సమర్పించాలి అంటూ ఇస్లామాబాద్ కోర్టు పలు సార్లు లేఖలు రాసినప్పటికీ వాటికి బదులు ఇవ్వకపోవడం తో ప్రధాని ఇమ్రాన్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే ఆయనను పరారీ లో ఉన్న నిందితుడిగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.