ప్రపంచంలో సంచలనాలకు మారు పేరు అయినటువంటి ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలనానికి నాంది పలికారు. ప్రపంచంలోనే తొలిసారి మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చడం ద్వారా మరోసారి ఆయన వార్తల్లో కేంద్ర బిందువుగా మారారు.
తమ న్యూరాలింక్ ప్రాజెక్టులో భాగంగా తొలిసారిగా మానవ మెదడులో చిప్ ను అమర్చామని టెస్లా అధినేత ఎలన్ మస్క్ సోమవారం X లో పోస్ట్ చేసారు. ఆదివారం సర్జరీ జరిగిందని, చిప్ అమర్చిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఆరంభ పనితీరు అద్భుతంగా ఉందని తెలిపారు. ఈ పరిశోధనల కోసం 1500 జంతువుల్ని టెస్లా వధించిందన్న విమర్శలున్నాయి. దీని కోసం న్యూరాలింక్ గత సంవత్సరం మానవ ట్రయల్స్ కోసం US ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదాన్ని పొందింది.
అయితే వీటిపై ముందుగానే పరిశోధనలు జరిపిన ఈ సంస్థ.. ఇప్పటికే పందులు, కోతుల మెదడులలో కొన్ని ఎలక్ట్రానిక్ చిప్‌లను విజయవంతంగా అమర్చి పరీక్షలు జరిపింది. ఈ ఎలక్ట్రానిక్ చిప్ అత్యంత సురక్షితమైందని.. విశ్వసనీయమైందని వెల్లడించారు. ఈ ఎలక్ట్రానిక్ చిప్ సాయంతో ఒక కోతి పాంగ్ అనే వీడియో గేమ్‌ను కూడా ఆడిందని పేర్కొన్నారు.