సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కు నాంపల్లి కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ తీర్పు పై సూరి భార్య భానుమతి మీడియా ముందు స్పందించారు. న్యాయస్థానం భాను కిరణ్‌కు ఉరి శిక్ష వేస్తే సూరి ఆత్మ శాంతించేదన్నారు. సూరిని నమ్మించి భాను కిరణ్ హత్య చేశారన్నారు. భాను కిరణ్ మొదటి నుంచి సూరి దగ్గర నమ్మకం ఉన్నాడని.. డబ్బు, ఆస్తుల కోసమే తన భర్తను దారుణంగా హతమార్చాడన్నారు. సూరి అంటే అందరూ వణుకుతారని.. ఆయన పేరు చెప్పుకొని భానుకిరణ్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడని ఆమె ఆరోపించారు.
తీర్పు ఏలా ఉన్నా న్యాయస్థానంపై తనకు గౌరవముందన్నారు. ఈ హత్యలో పరిటాల కుటుంబ సభ్యులను కూడా విచారిస్తే బాగుండేదన్నారు. 2011 జనవరి 4న గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరిని హైదరాబాద్ యూసఫ్‌గూడలో సూరిని.. నమ్మకమైన అనుచరుడిగా ఉన్న భానుకిరణ్ హతమార్చాడు. అప్పటి నుంచి పరారీలోఉన్న భాను 2012లో అనూహ్యంగా జహీరాబాద్‌లో పోలీసులకు దొరికాడు. దీంతో నాటి నుంచి సుదీర్ఘ విచారణ తర్వాత భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది.