సుప్రీంతీర్పుతో శబరిమల ఆలయానికి రాజకీయ రంగు పులుముకుంటున్నట్లు తెలుస్తోంది. 10-50 సంవత్సరాల వయస్సున్న మహిళలను అయ్యప్ప దర్శనానికి అనుమతించాలని సుప్రీం ఇటీవలే తీర్పుని వెలువరించిన విషయం తెలిసిందే.. అయితే దేశ వ్యాప్తంగా ఈ తీర్పుపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం తీర్పుని కేరళ ప్రభుత్వం అమలు చేస్తుందని కేరళ సీఎం ప్రకటించారు. తీర్పుని.. భాజపా, కాంగ్రెస్‌లు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ను ఉద్దేశించి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శబరిమలకు మద్దతుగా ఉంటామని, ఒకవేళ భక్తుల మనోభావాలు దెబ్బతియడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తే, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా సిద్ధమేనని షా హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన సీఎం పినరయ్ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సర్వోన్నత న్యాయస్థానానే బెదిరించేందుకు అమిత్ షాకు ఎన్ని గుండెలు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని, అయితే, ఆయనకున్న బలం దానికి సరిపోదని విజయన్ వ్యాఖ్యానించారు.