అనంత పోలీసుల‌పై జేసీ ఫైర్‌

-

*ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి అవినీతికి కొమ్ముకాస్తున్నారు

* సీఎం ముందు చిట్టా విప్పుతా

అనంతపురం అధికార యంత్రాంగంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి కోపం వచ్చింది. పోలీసులు, జిల్లా అధికారులు చేతగానితనంతో పనిచేస్తున్నారని విమర్శించారు.  అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యే  ప్ర‌భాక‌ర్ చౌద‌రి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌ చౌదరి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్కియాలజీకి అప్పగించిన పీస్‌ మెమోరియల్‌ హాల్‌పై ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో దౌర్జన్యాలు, రౌడీయిజం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.  దొంగతనం చేసినవారిని కుర్చీలో కూర్చోబెడుతున్నారని, పోలీసులకు అసలు వెన్నెముకే లేదని జేసీ విమర్శించారు. పాము బుస కొడుతుంది.. కానీ కాటేయదని, ఆ బుస కొట్టేది కూడా లేకపోతే పోలీసులు ఇంకేం పని చేస్తారు? ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడం పోలీసు చరిత్రలో ఇదే తొలిసారని జేసీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారుల చిట్టాను ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందుంచుతానని చెప్పారు. ఈ క్రమంలో మీడియాను జేసీ వదిలిపెట్టలేదు. అనంతపురంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నా మీడియా ప్రతినిధులు కళ్లుమూసుకొని కూర్చున్నారంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news