రాష్ట్రంలోని ఓటర్లకు తెరాస అధినేత కేసీఆర్ లేఖలు రాయనున్నారు. తెరాసను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ…ప్రతీ ఓటరుకు లేఖ రాయాలని దీంతో ఓటర్లకు మరింత దగ్గరవ్వనున్నట్లు వ్యూహరచన చేస్తున్నారు. వీటికి సంబంధించి ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ నివాసంలో సమావేశం జరిగింది రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో వివిధ పథకాల కింద దాదాపు కోటి 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులున్నారని, అందరికీ లేఖ రాయడం వల్ల తెరాసకు మేలు జరుగుతుందని సమావేశంలో నేతలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కొత్త జిల్లాల ఏర్పాటు, వేతనాల పెంపు, ఇతర పథకాలు, కార్యక్రమాల సమాచారంతోపాటు రాష్ట్ర వృద్ధిరేటుకు సంబంధించి, పరిశ్రమల ప్రగతి ఇతర అంశాలను ఇందులో చేర్చాలని నిర్ణయించారు.
లేఖలను గ్రామాల్లో అర్థమమ్యే విధంగా తెలుగుతోపాటు ఉర్దూ భాషలో ముద్రించనున్నారు. లేఖకు సంబంధించిన సందేశాన్ని సోమవారం నాటికి సిద్ధం చేసి ఆ వెంటనే ముద్రణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తెరాస ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వానికి ఉన్న ఆవశ్యకతను ప్రధానంగా వివరించానున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నూతన ఒరవడితో ప్రచారం చేయడంతో క్షేత్ర స్థాయిలో తెరాస మరింత పట్టు సాధించనుంది.