ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనవరిలో 19 కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. 2019లో జరిగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని లేఖలో పేర్కొన్నారు.
కోల్ కతా వేదికగా తిరుగుబావుటా ఎగురవేద్దాం… .దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం… ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’ అంటూ లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే భాజపా పై వ్యతిరేకతను పార్లమెంటు వేదికగా వినిపించిన చంద్రబాబు మరోసారి తెలుగు వారి సత్తాను ఢిల్లీకి చాటనున్నట్లు తెదేపా నేతలు చర్చించుకుంటున్నారు.